టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ న్యూజిల్యాండ్‌పై సూపర్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు విజయాన్నందించాడు. 20 ఏళ్లుగా వరల్డ్ కప్ టోర్నీల్లో న్యూజిల్యాండ్‌ను ఓడించాలనే టీమిండియా కలను నిజం చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ 95 పరుగుల వద్ద అవుటై త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
అయితే సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ కోహ్లీ తన కెరీర్లో ఓ 3 మైలురాళ్లను మాత్రం అధిగమించాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్ట్‌లో కోహ్లీ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. 2008లో వన్డేల్లో అరంగేట్రం చేసిన కోహ్లీ.. న్యూజిల్యాండ్‌పై చేసిన 95 పరుగులతో కలుపుకుని ఇప్పటివరకు 274 ఇన్నింగ్స్‌లో 13,437 రన్స్ చేశాడు. ఈ క్రమంలోనే శ్రీలంక లెజెండ్ సనత్ జయసూర్య (13,430) ని అధిగమించాడు.

ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో 3000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా భారత్ విజయాలు దక్కించుకున్న మ్యాచ్‌లలో అత్యధికంగా అర్థసెంచరీలు బాదిన రికార్డునూ కోహ్లీ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు టీమిండియా గెలిచిన మ్యాచ్‌లలో 137 సార్లు కోహ్లీ అర్థ సెంచరీ లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ (136 హాఫ్ సెంచరీలు)ను అధిగమించాడు.
ఇదిలా ఉంటే ఆదివారం న్యూజిల్యాండ్‌తో జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. మొదట మహమ్మద్ షమీ (54-5) 5 వికెట్లతో న్యూజిల్యాండ్ బ్యాటర్లను వణికించాడు. ఆ తర్వాత 274 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (46) పర్వాలేదనిపించినా.. గిల్ (26), శ్రేయస్ అయ్యర్ (33), కేఎల్ రాహుల్ (27) ఫెయిల్ అయ్యారు.
అయితే విరాట్ కోహ్లీ (95) మాత్రం మరోసారి రాణించాడు. నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చివర్లో విజయానికి 5 పరుగులు కావల్సి ఉండగా.. కోహ్లీ కూడా సెంచరీకి 5 పరుగుల దూరంలోనే నిలిచాడు. దీంతో బంగ్లాపై సెంచరీ బాదినట్లే న్యూజిల్యాండ్‌పై కూడా సిక్స్‌తో సెంచరీ చేసుకుందామని కోహ్లీ ప్రయత్నించాడు.
కానీ హెన్రీ బౌలింగ్‌లో మిడ్ ఆన్‌లో ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అలాగే వన్డేల్లో 49 సెంచరీలు సాధించి సచిన్ టెండూల్కర్ పేరున ఉన్న రికార్డును సమం చేసే అవకాశాన్నీ చేజార్చుకున్నాడు.