క్రికెట్ ఫ్యాన్స్‌కు జియో సినిమా మరో బంపరాఫర్ ఇచ్చింది. ఐపీఎల్‌ను అందరికీ ఉచితంగా చూపించిన జియోసినిమా.. ఇప్పుడు ఆసియా కప్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా సిరీసును కూడా ఉచితంగా చూపించనుందట. ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న టీమిండియా.. ఆ తర్వాత ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే.
ఇటీవల బీసీసీఐ బ్రాడ్ కాస్ట్ హక్కులను వయాకామ్18 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జియోసినిమా కూడా ఈ కంపెనీకి చెందినదే. ఈ క్రమంలోనే కొత్త సైకిల్‌లో భాగంగా ఆసీస్‌తో సిరీస్ ఈ సంస్థకు తొలి కవరేజ్. దీన్ని అందరికీ ఉచితంగా ఇవ్వాలని జియోసినిమా భావిస్తోంది. అంతేకాదు మొత్తం 11 భాషల్లో ఈ మ్యాచులను వీక్షించే అవకాశం కల్పిస్తుందట.

ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మ్యాచ్ కామెంటరీ ఉంటుందట. అంతేకాదు, మంచి ఎక్స్‌పర్ట్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా జియోసినిమా ప్రయత్నిస్తోంది. దీనికోసం సురేష్ రైనా, కేదార్ జాదవ్, ఆకాష్ చోప్రా, అమిత్ మిశ్రా, హనుమ విహారి, కిరణ్ మోరే, అనిరుధ శ్రీకాంత్, శరణ్‌దీప్ సింగ్ తదితర మాజీ దిగ్గజాలను కూడా రిక్రూట్ చేసుకుంది.
దేశంలో క్రీడలను చూసే అనుభవాన్ని పూర్తిగా మార్చేయడమే తమ లక్ష్యం అని వయాకామ్18 కంపెనీ సీఈవో అనిల్ జయరాజ్ స్పష్టం చేశారు. సంప్రదాయ టీవీ ప్రోగ్రామింగ్‌తోపాటు డిజిటల్ వేదికలను కలగలిపి ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభవం అందించడమే తమ టార్గెల్ అని చెప్పారు. భారత్ ఆడే అన్ని హోం మ్యాచ్‌ల టీవీ, డిజిటల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను వేలంలో వయాకామ్18 సొంతం చేసుకుంది.

ఇక ఆస్ట్రేలియాతో ఆడే మూడు వన్డేల సిరీస్ భారత్‌కు చాలా కీలకం కానుంది. ఇది ముగిసిన వెంటనే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో జట్టుకు చివరి మెరుగులు దిద్దేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆసియా కప్‌లో ఒక్క మ్యాచ్ ఆడగానే గాయంతో ఇబ్బంది పడుతున్న శ్రేయాస్ అయ్యర్ వంటి వారి ఫిట్‌నెస్‌ను కూడా ఆసీస్ సిరీసులో పరీక్షించవచ్చు. సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.