ఆసియా కప్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఇకపై అందరి దృష్టి వరల్డ్ కప్ మీదనే ఉండనుంది. ఈ క్రమంలో మెగాటోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచే ప్లేయర్లు, టాప్ వికెట్ టేకర్లు ఎవరవుతారని తెగ చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సౌతాఫ్రికా లెజెండ్ జాక్వస్ కలిస్ కూడా తన అంచనాలు వెల్లడించాడు. మొత్తం ఐదుగురిని వరల్డ్ కప్‌లో జాగ్రత్తగా ఫాలో అవ్వాలని కలిస్ చెప్పాడు.
వీరిలో ముగ్గురు బ్యాటర్లు, ఒక స్పిన్నర్, ఒక పేసర్ ఉన్నారు. ఐసీసీ షేర్ చేసిన ఒక వీడియోలో కలిస్ ఈ పేర్లు వెల్లడించాడు. విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్, ఆన్రిచ్ నోకియా, జోస్ బట్లర్, రషీద్ ఖాన్.. ఈ ఐదుగురు కూడా వరల్డ్ కప్‌లో బాగా ప్రభావం చూపుతారని చెప్పాడు. 'ఆఫ్గనిస్తానకు రషీద్ ఖాన్ చాలా కీలకం కానున్నాడు. ఇటీవలి కాలంలో తను బాగా ఆడుతున్నాడు. ఇక భారత్‌లో పరిస్థితులు అతనికి బాగా కలిసొస్తాయి' అని తెలిపాడు.

ఆఫ్గాన్ టీంను రషీద్ ముందుండి నడిపిస్తాడని, తనొక ఫైటర్ అని చెప్పిన కలిస్.. ఆఫ్గాన్ టీంలో రసీద్ చాలా పెద్ద పాత్ర పోషిస్తాడని అన్నాడు. అలాగే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీపై కూడా కలిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. స్వదేశంలో ఇదే తనకు చివరి వరల్డ్ కప్ అయ్యే అవకాశం ఉందని, కాబట్టి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ కోహ్లీ ఉపయోగించుకుంటాడని జోస్యం చెప్పాడు.
'నేను ఎంచుకునే మరో ప్లేయర్ విరాట్ కోహ్లీ. ప్రపంచం మొత్తాన్ని వెలుగుతో నింపేయాలని అనుకుంటాడతను. స్వదేశంలో కోహ్లీకి ఇదే చివరి వరల్డ్ కప్ అవ్వొచ్చు. కాబట్టి దాన్ని బ్యాంగ్‌తో ముగించాలని కోహ్లీ కోరుకుంటాడు. భారత టాపార్డర్‌లో కోహ్లీ చాలా కీలక పాత్ర పోషిస్తాడు' అని కలిస్ అభిప్రాయపడ్డాడు. వీరితోపాటు సఫారీ పేసర్ నోకియా కూడా సౌతాఫ్రికా తరఫున బాగా ప్రభావం చూపుతాడని అన్నాడు.
ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా ఆ టీంకు చాలా కీలకం అవుతాడని చెప్పాడు. భారత్‌లో బట్లర్‌కు మంచి రికార్డు ఉందని, కాబట్టి అతను ఈ మెగాటోర్నీలో తప్పకుండా రాణిస్తాడని అన్నాడు. అలాగే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా వరల్డ్ కప్‌లో చెలరేగుతాడని అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్‌లో బాబర్ చాలా కీలకం అవుతాడని పేర్కొన్నాడు.