టీమిండియాను ఎప్పటి నుంచో నెంబర్ ఫోర్ సమస్య వెన్నాడుతోంది. మిడిలార్డర్‌ను బలోపేతం చేసుందుకు నాలుగో నెంబర్‌లో మంచి బ్యాటర్ ఉండటం చాలా ముఖ్యం. కానీ ఆ స్థానంలో రాణించే ప్తేయర్‌ను మాత్రం సెలెక్టర్లు గుర్తించలేకపోయారు. ఈ క్రమంలోనే మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సలహా ఇచ్చాడు.
మూడో స్థానంలో వచ్చే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో పంపాలని డిమాండ్ చేశాడు. తన కెరీర్‌లో కోహ్లీ మొత్తం 42 సార్లు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. వీటిలో 55.21 సగటుతో 1767 పరుగులతో రాణించాడు. నాలుగో నెంబర్‌లో బ్యాటింగ్ చేస్తూ కోహ్లీ ఏడు సెంచరీలు కూడా చేశాడు. ఈ స్థానంలో కోహ్లీ బెస్ట్ స్కోరు 139 నాటౌట్ కావడం గమనార్హం.

2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ స్కోరు సాధించాడు. అంతేకాదు కోహ్లీ ఇదే జట్టుపై కేవలం 86 బంతుల్లోనే 133 పరుగులతో అజేయంగా నిలిచిన ఇన్నింగ్స్ కూడా నాలుగో నెంబర్‌లో ఆడిందే. అయితే 2019 నుంచి కోహ్లీ ఈ స్థానంలో పెద్దగా ఆడలేదు. కేవలం రెండు సార్లు మాత్రమే ఈ స్థానంలో బ్యాటింగ్ చేశాడు.
ఆస్ట్రేలియాపై 2019 మార్చిలో జరిగిన మ్యాచ్‌లో నాలుగో నెంబర్‌లో ఆడిన అతను కేవలం ఏడు పరుగులే చేశాడు. ఇక అదే టీంపై 2020 జనవరిలో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగులు చేశాడు. ఈ వన్డే ఫార్మాట్‌లో భారత జట్టుకు సరైన నెంబర్ ఫోర్ బ్యాటర్ ఇప్పటి వరకు దొరకలేదు. దీని వల్లనే టీమిండియా వరల్డ్ కప్ వంటి టోర్నీలో గెలవలేకపోయిందని కూడా చెప్పొచ్చు.
టాపార్డర్ బలంగా ఉన్న టీమిండియాకు మిడిలార్డర్ బలహీనంగా మారిపోయింది. యువరాజ్ సింగ్ ఉన్నప్పుడు అతను ఈ స్థానంలో రాణించాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ ఈ స్థానంలో ఆకట్టుకున్నాడు. అయ్యర్ ఈ స్థానంలో 20 ఇన్నింగ్సులు ఆడి 805 పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ వెన్ను గాయం కారణంగా అతను ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.