వరల్డ్ కప్‌లో కీలక పోరుకు భారత జట్టు రెడీ అవుతోంది. వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచులో శ్రీలంకను ఎదుర్కోనుంది. ఈ మ్యాచులో కనుక భారత్ గెలిస్తే సెమీస్ బెర్తు ఖాయమవుతుంది. దీంతో అందరూ ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఆసియా కప్ ఫైనల్‌లో ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని శ్రీలంక భావిస్తోంది.
అంతేకాదు, 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ చేతిలో శ్రీలంక ఓడింది కూడా వాంఖడే స్టేడియంలోనే కావడం గమనార్హం. ఇలాంటి కారణాల వల్ల ఈ మ్యాచ్‌పై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఉన్న ఫామ్ బట్టి చూస్తే ఈ మ్యాచులో భారత్ ఫేవరెట్ అని చెప్పాలి. ఈ రెండు జట్లు తమ చివరి మ్యాచుల్లో ఎదుర్కొన్న ఫలితాలు కూడా భిన్నంగా ఉన్నాయి.

బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై ఇంగ్లండ్‌ను ఎదుర్కొన్న భారత్.. అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ చక్కని ఇన్నింగ్స్‌కు తోడు మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా ఇద్దరూ బంతితో విజృంభించడంతో ఇంగ్లండ్‌పై ఏకంగా 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇది ఈ టోర్నీలో భారత్‌కు వరుసగా ఆరో విజయం.
ఇక శ్రీలంక విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తమ చివరి మ్యాచులో శ్రీలంక ఘోరంగా ఓడింది. ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి ఆశించిన స్కోరు చేయలేకపోయిన ఆ జట్టు.. ఆఫ్ఘన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో కూడా తడబడింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. ఇప్పుడు భారత్ చేతిలో కూడా ఓడితే ఆ టీం సెమీస్ ఆశలు ఆవిరైనట్లే.
ఇక పిచ్ విషయానికొస్తే.. వాంఖడే పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంగా పేరు. ఇక్కడి సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 255. ఈ స్టేడియంలో జరిగిన మ్యాచుల్లో అధికశాతం ఛేజింగ్ టీమ్ గెలిచినవే. అయితే 350పైగా పరుగులు చేస్తే మాత్రం మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కానీ మంచు ప్రభావం, ఇతర కారణాల వల్ల టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ముంబైలో వర్షం పడే అవకాశాలు కూడా ఏమాత్రం లేవు. కాబట్టి ఫ్యాన్స్ పూర్తి మ్యాచ్‌ను ఆస్వాదిస్తారు. ఇక్కడ కచ్చితంగా హై స్కోరింగ్ మ్యాచ్ చూస్తారని నిపుణులు అంటున్నారు. మరి ఈ రెండు జట్లు ఎలా ఆడతాయో చూడాలి.