వరల్డ్ కప్‌లో భారత జట్టు అదరగొట్టింది. శ్రీలంకను ఏకంగా 302 పరుగుల తేడాతో చిత్తు చేసి సెమీఫైనల్‌లో అడుగు పెట్టిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు అద్భుతంగా ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ (4) ఫెయిలైనా.. విరాట్ కోహ్లీ (88), శుభ్‌మన్ గిల్ (92), శ్రేయాస్ అయ్యర్ (82) చెలరేగారు.
దీంతో భారత్ 357 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. జస్‌ప్రీత్ బుమ్రా తొలి బంతికే వికెట్ తీసుకున్నాడు. సిరాజ్ కూడా తను వేసిన తొలి బంతికే వికెట్ తీసుకున్నాడు. ఇక షమీ తను వేసిన తొలి ఓవర్లో ఏకంగా రెండు వికెట్లు తీసుకొని శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీశాడు.

ఇలా భారత పేసర్లు చెలరేగడంతో శ్రీలంక జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. దీంతో భారత్ 302 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, ఈ వరల్డ్ కప్‌లో సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది.
వీళ్లిద్దరూ కూడా ముంబై వాసులే. ఇద్దరూ వాంఖడేలో ఆడుతూనే పెరిగారు. అందుకే మ్యాచ్ ముగిసిన తర్వాత ఇక్కడి ఫ్యాన్స్‌తో వాళ్లిద్దరూ వచ్చి ముచ్చటించారు. కాసేపు వాళ్లతో ముచ్చట్లు చెప్పిన తర్వాత.. అక్కడే ఉన్న చిన్నారులను చూశారు. తమ షూస్ తీసుకొచ్చి ఆ పిల్లలకు ఇచ్చేశారు. దీంతో ఆ పిల్లలు తెగ సంతోషించారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రోహిత్, అయ్యర్ చేసిన పనిని క్రికెట్ అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. అసలు వాళ్లిద్దరూ తమ వద్దకు రావడంతోనే థ్రిల్ అయిపోయిన అభిమానులకు.. వాళ్లు ఇలా షూస్ ఇవ్వడం మరింత ఉత్సాహాన్ని పంచింది.