శ్రీలంకపై టీమిండియా విజయంలో మహమ్మద్ షమీతోపాటు మహమ్మద్ సిరాజ్ కూడా కీలక పాత్ర పోషించాడు. లంక టాపార్డర్ నడ్డి విరిచింది సిరాజే. అయితే అతను ఈ వరల్డ్ కప్ మొదలైన తర్వాత అంత గొప్ప ఫామ్ కనబరచలేదు. అదే సమయంలో షమీ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
పాండ్యాకు గాయం అవడంతో జట్టులోకి వచ్చిన షమీ.. ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్‌లో మూడు మ్యాచులే ఆడాడు. కానీ 14 వికెట్లతో చెలరరేగాడు. అదే సమయంలో ఆరంభం నుంచి ఆడుతున్న సిరాజ్ అంత గొప్పగా రాణించలేదు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అతనిపై నమ్మకం ఉంచాడు. శ్రీలంకతో మ్యాచులో ఫామ్‌లో ఉన్న షమీని కాదని, కొత్త బంతిని సిరాజ్‌కే ఇచ్చాడు.

ఈ మ్యాచులో ఫామ్ అందుకున్న సిరాజ్.. మూడు వికెట్లతో రాణించాడు. ఈ నిర్ణయాన్ని టీమిండియా మాజీ దిగ్గజం ఆకాష్ చోప్రా తెగ మెచ్చుకున్నాడు. 'సిరాజ్ విషయంలో నేను ముందుగా రోహిత్‌ను మెచ్చుకుంటా. షమీ ఉండగా కొత్త బంతిని సిరాజ్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదని చాలా మంది అన్నారు. అయినా అతను మాత్రం సిరాజ్‌పై నమ్మకం కోల్పోలేదు' అని ప్రశంసించాడు.
'ఎప్పుడైనా ఒక ప్లేయర్‌ను మెరుగుదిద్దేది కెప్టెనే. ఒక ప్లేయర్ కెరీర్ నాశనం చేయడం చాలా సింపుల్. కానీ దాన్ని నిలబెట్టడం చాలా కష్టం' అని చోప్రా అన్నాడు. అదే సమయంలో సిరాజ్‌కు అండగా నిలబడిన రోహిత్ ధైర్యాన్ని కొనియాడాడు. 'షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అయినా సిరాజ్‌కు బంతి ఇస్తే ఎంతో మంది విమర్శించడం సహజమే' అని చెప్పాడు.
'కానీ సిరాజ్‌కు ఇప్పుడు గనుక రోహిత్ అండగా నిలబడకపోతే.. ఆ తర్వాత భవిష్యత్తులో మియాన్ మ్యాజిక్ తిరిగి రావడం అసాధ్యమయ్యేది. కనీసం ఈ వరల్డ్ కప్ అంత వరకైనా అది చూసేవాళ్లం కాదు. సిరాజ్‌కు రోహిత్ అండగా ఉన్నాడు కాబట్టే.. ఆ మియాన్ మ్యాజిక్ తిరిగొచ్చింది' అని చోప్రా పేర్కొన్నాడు.