ప్రస్తుతం వరల్డ్ కప్‌లో టీమిండియా ఫీల్డింగ్ కూడా అదరగొడుతోంది. మన ప్లేయర్లు అద్భుతమైన క్యాచులు అవలీలగా పట్టేస్తున్నారు. దీనంతటి వెనుక మోటివేషన్ ఏంటి? అంటే కొత్తగా మొదలు పెట్టిన 'బెస్ట్ ఫీల్డర్' మెడల్ విధానమే అని చెప్పాలి. మ్యాచులో అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన ప్లేయర్లకు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఈ మెడల్ అందిస్తున్నాడు.
ప్లేయర్లు కూడా దీన్ని చాలా ఉత్సాహంగా తీసుకుంటున్నారు. దీంతో క్యాచులు పట్టడం, ఫీల్డింగ్ చేయడంపై ఆటగాళ్ల ఫోకస్ కూడా బాగా పెరిగింది. అయితే జస్ట్ మెడల్స్ ఇవ్వడంతో ఆగని టీం మేనేజ్‌మెంట్.. మ్యాచ్ మ్యాచ్‌కూ ఈ బెస్ట్ ఫీల్డర్ అవార్డు ఎవరికి దక్కిందో రివీల్ చేసే విధానాన్ని కూడా కొత్తగా మారుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీలంకతో మ్యాచులో కూడా ఇదే పద్ధతిని పాటించింది.

బెస్ట్ ఫీల్డర్ ఎవరు అని టీం అంతా ఎదురు చూస్తుండగా.. దిలీప్ వచ్చి మ్యాచులో అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన ఆటగాళ్ల వీడియోలు చూపించాడు. దానిలో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. వీరి వీడియోలు చూపించిన తర్వాత మెడల్ ఎవరికి వచ్చిందో ప్రకటించడానికి సచిన్ వీడియోను ప్లే చేశారు.
ఆ వీడియోలో 2003 వరల్డ్ కప్ అనుభవాలను ఆటగాళ్లతో సచిన్ పంచుకున్నాడు. ఆ మెగాటోర్నీలో మరపురాని విషయాలను చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత వీడియో చివర్లో బెస్ట్ ఫీల్డర్‌గా శ్రేయాస్ అయ్యర్ పేరు ప్రకటించాడు. అనంతరం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి వీడియోను ముగించాడు. దీన్ని బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో కూడా పంచుకుంది.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, ఇప్పటి వరకు టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్ అవార్డును కేఎల్ రాహుల్ ఒక్కడే రెండు సార్లు అందుకున్నాడు. ఇప్పుడు అయ్యర్ కూడా అతని సరసన చేరాడు. శ్రీలంక మ్యాచులో తీసుకున్న మెడల్.. అయ్యర్‌కు రెండోది కావడం గమనార్హం. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఒక్కోసారి ఈ మెడల్ తీసుకున్నారు.