వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంక, టీమిండియా జట్లు వాంఖడే వేదికగా తలపడుతున్నాయి. సరిగ్గా ఈ మ్యాచ్ మొదలవడానికి ముందు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ లైఫ్ సైజ్ విగ్రహాన్ని ఈ స్టేడియంలో ఆవిష్కరించారు. సచిన్ ఫేవరెట్ షాట్లలో ఒకటైన స్ట్రెయిట్ లాఫ్టెడ్ షాట్ ఆడుతున్న విగ్రహాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆవిష్కరించారు.
ఇక్కడి అహ్మద్‌నగర్‌కు చెందిన ప్రమోద్ కాంబ్లే అని శిల్పి ఈ విగ్రహాన్ని తయారు చేశాడు. సచిన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా వాంఖడేలో అతని విగ్రహం ఏర్పాటు చేస్తామని ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంది.

అసలు ఇక్కడ సచిన్ ఏ షాట్ ఆడిన విగ్రహం ఏర్పాటు చేయాలని ఎంసీఏ అధికారులు చాలా శ్రమ పడినట్లు తెలుస్తోంది. చివరకు ఈ స్ట్రెయిట్ లాఫ్టెడ్ షాట్ ఫొటోను ఎంపిక చేయగా.. సచిన్ కూడా ఇది బాగుందని చెప్పాడట. దీంతో ఇదే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఈ విగ్రహం గురించి మ్యాచ్ ముందు జరిగిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మాట్లాడాడు. తాము ప్రాక్టీస్ సమయంలో ఈ విగ్రహాన్ని చూశామని, కానీ దగ్గరగా చూసే అవకాశం దక్కలేదని చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత చూస్తామన్నాడు.
ఇక ఈ విగ్రహం గురించి తానేం చెప్పలేనని, ఆ స్ట్రెయిట్ లాఫ్టెడ్ షాట్ చాలా చక్కగా ఉందని అన్నాడు. తాము ఆ విగ్రహాన్ని చూసి చాలా ఎంజాయ్ చేశామన్న రోహిత్.. అందరికీ ఇది గుర్తుండిపోతుందని చెప్పాడు.
స్టేడియంలో సచిన్ స్టాండ్‌కు సమీపంలోనే దీన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సచిన్ తన కుటుంబంతో కలిసి పాల్గొన్నాడు. దీన్ని చూసేందుకు చాలా మంది అభిమానులు చాలా ముందుగానే స్టేడియానికి వచ్చారు. మ్యాచ్ సమయంలో కూడా చాలా మంది ఈ విగ్రహం ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ కనిపించారు.