శ్రీలంకపై భారత బౌలింగ్ విభాగం మరోసారి చెలరేగింది. ఆ టీంను కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేసింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 357 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు తొలి బంతికే షాకిచ్చాడు బుమ్రా. ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీసుకున్నాడు
ఆ షాక్ నుంచి తేరుకునేలోపే రెండో ఓవర్ తొలి బంతికి సిరాజ్ కూడా వికెట్ తీసుకున్నాడు. ఆ ఓవర్లో అతను రెండు వికెట్లతో రాణించాడు. ఇలా వీళ్లిద్దరూ చెలరేగడంతో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 14 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఇక ఆ తర్వాత బంతి అందుకున్న వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ.. దాదాపుగా వేసిన ప్రతి ఓవర్లో వికెట్ తీసుకున్నాడు.

ఈ క్రమంలో కేవలం 18 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో భారత జట్టు ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించింది. ఇది ఈ వరల్డ్ కప్‌లో భారత్‌కు వరుసగా ఏడో విజయం కావడం గమనార్హం. దీంతో పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇది చూసిన కొందరు పాకిస్తానీలకు కన్నుకుట్టినట్లుంది.
ఇలా భారత జట్టు వరుసగా విజయాలు సాధించడంపై పాక్ మాజీ క్రికెటర్ హసన్ రజా సంచలన కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచులు చూస్తుంటే బీసీసీఐ చీటింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోందన్నాడు. మిగతా బౌలర్ల కన్నా కూడా భారత బౌలర్లకు ఎక్కువ స్వింగ్ లభిస్తోందని, వారికి స్పెషల్ బాల్స్ ఇస్తున్నట్లు అనిపిస్తోందని ఆరోపణలు చేశాడు.
చివరకు డీఆర్ఎస్ నిర్ణయాలు కూడా టీమిండియాకే అనుకూలంగా వస్తున్నాయని ఆరోపించిన అతను.. దీనిపై కచ్చితంగా విచారణ జరిపించాల్సిందే అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ ఫక్కున నవ్వుతున్నారు. ఎందుకంటే మ్యాచ్ ఫిక్సింగ్ చేసినందుకే హసన్ రజాపై నిషేధం పడింది. ఆ తర్వాత అతను మళ్లీ క్రికెట్ ఆడలేదు.
అలాంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు భారత జట్టు చీటింగ్ చేస్తుందని అనడంతో వాళ్లు నెట్టింట జోకులు పేలుస్తున్నారు. పాకిస్తాన్ వరుసగా నాలుగు మ్యాచులు ఓడి, టీమిండియా ఏడు మ్యాచుల్లో ఓటమి లేకపోవడంతోనే అతను ఇలా గింజుకుంటున్నాడంటూ జోకులు పేలుస్తున్నారు.