వరల్డ్ కప్‌లో ఉత్కంఠ భరిత మ్యాచులు క్రికెట్ ప్రేమికులను తెగ ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ఈ మ్యాచులను నేరుగా స్టేడియంలో చూడాలని ఫ్యాన్స్ కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ ఈ మ్యాచుల టికెట్లు మాత్రం చాలా మందికి దొరకడం లేదు. ముఖ్యంగా టీమిండియా మ్యాచుల టికెట్లకు భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.
కానీ ఈ మ్యాచుల టికెట్లు మాత్రం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం కుదరడం లేదు. ఎప్పుడూ పేటీయంలో క్రికెట్ మ్యాచుల టికెట్లు అమ్మకానికి ఉంచే బీసీసీఐ.. ఈ వరల్డ్ కప్ టికెట్లను మాత్రం 'బుక్‌మైషో' ద్వారా అమ్మకానికి పెట్టింది. ఈ ప్లాట్‌ఫాంలో టికెట్లు అమ్మకానికి పెట్టినప్పటి నుంచి ఫ్యాన్స్‌కు చాలా ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి.

గంటల తరబడి వెయిటింగ్ లిస్టు చూపించడం, అంతసేపు వర్చువల్ క్యూలో ఉన్నా టికెట్లు దొరక్కపోవడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనబడుతోంది. ఈ మ్యాచ్ జరిగేది విరాట్ కోహ్లీ పుట్టిన రోజు కావడంతో మ్యాచ్ టికెట్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది.
ఈ క్రమంలోనే బీసీసీఐ, బుక్‌మైషో, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్)పై ఒక అభిమాని ఏకంగా పోలీసు కంప్లయింట్ చేశాడు. సాధారణ ప్రజలు ఆన్‌లైన్‌లో ఈ మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేయలేకపోతున్నారని, భారీ సంఖ్యలో టికెట్లు ఆపేస్తున్న ఈ సంస్థలు.. వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నాయని సదరు అభిమాని తన ఫిర్యాదులో ఆరోపించాడు.
కోల్‌కతా పోలీసులు ఈ కేసు విషయంలో క్యాబ్, బుక్‌మైషో ప్రతినిధులను విచారణ కోసం పిలిపించినట్లు తెలుస్తోంది. ఇలా ఫ్యాన్స్ ఇబ్బందులు పడుతున్నా కూడా బీసీసీఐ ఈ విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పుడు ఇలా కేసు నమోదవడంపై కూడా బీసీసీఐ, బుక్‌మైషో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. మరి ఈ కేసు ఏమవుతుందో చూడాలి.