Kohli Birthday: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఈ వరల్డ్ కప్ బాగా కలిసొచ్చింది. ఈ మెగా టోర్నీలో సౌతాఫ్రికాతో భారత జట్టు నవంబరు 5న తలపడనుంది. అదే రోజు కోహ్లీ బర్త్ డే కూడా. ఈ క్రమంలో మ్యాచ్ నిర్వహించే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందట. కోహ్లీ కోసం ప్రత్యేకంగా ఒక భారీ కేక్ కూడా ఏర్పాటు చేస్తోందట.
ప్రస్తుతం వరల్డ్ కప్‌లో ఆరో టాప్ స్కోరర్‌గా ఉన్న కోహ్లీ.. వరల్డ్ కప్ ఆరంభం నుంచి చక్కగా రాణిస్తున్నాడు. కేవలం పాకిస్తాన్, ఇంగ్లండ్ మీద మాత్రమే అనవసరమైన షాట్లు ఆడబోయి పెవిలియన్ చేరాడు. మిగతా అన్ని జట్లపై అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడాడు. అసలు టీమిండియా ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆసీస్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.

ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై శతకంతో చెలరేగిన అతను.. కివీస్‌పై మరో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ప్రపంచంలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీ అని తెలిసిందే. ఈ క్రమంలోనే క్యాబ్ ప్రెసిడెంట్ స్నేహాశిష్ గంగూలీ.. కోహ్లీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించాడు. స్పెషల్ ఫైర్ వర్క్స్ షో కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పాడు.
'మేం కోహ్లీ కోసం ప్రత్యేకంగా పెద్ద కేక్ ఆర్డర్ చేశాం. విరాట్ కోహ్లీని చూడగానే అందరికీ గుర్తొచ్చే విషయంలా దాన్ని డిజైన్ చేశాం. అప్పుడే దాని ఫొటోలను మాత్రం షేర్ చేయడం లేదు. అది ఒక సర్‌ప్రైజ్. అలాగే మ్యాచ్ మిడ్ ఇన్నింగ్స్ ఇంటర్వల్‌లో ఫైర్ వర్క్స్ షో ఉంటుంది. తన బర్త్ డేను మేం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాగే మొత్తం కోల్‌కతా ప్రేక్షకులు అందరూ దీనిలో భాగస్వాములే అని చెప్పాలని అనుకుంటున్నాం' అని స్నేహాశిష్ అన్నాడు.
'ఈ మ్యాచులో కచ్చితంగా స్టేడియం నిండిపోతుందని మాకు తెలుసు. అలాగే మైదానంలో ఉండే వారంతా విరాట్ అభిమానులే అయ్యుంటారు. వాళ్లందరి తరఫున ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం' అని తెలిపాడు. అంతేకాదు మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులకు 70 వేల కోహ్లీ మాస్కులు కూడా అందజేస్తుందట క్యాబ్. ఇన్నింగ్స్ మధ్యలో వచ్చే లైట్ షో కూడా కోహ్లీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.