ఏ క్రికెటర్‌కైనా దేశం తరపున ఆడడమే గొప్ప విషయం. అదే వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ఆడగలిగితే ఆ ఆనందమే వేరు. ఇక వరల్డ్ కప్‌లో దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడే ఛాన్స్ దొరికితే.. ఆ ఆటగాడికి ఆ మ్యాచ్ ఎంత ప్రత్యేకమో వేరే చెప్పక్కర్లేదు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్‌లు తొలిసారి వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొంటున్నారు.

భారత టాప్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ఇది తొలి వన్డే వరల్డ్ కప్. గాయం నుంచి కోలుకున్న అయ్యర్.. కొద్దికా ఫామ్ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై డక్ అవుట్ అయిన అయ్యర్.. ఆ తర్వాత ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో 25 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఇప్పుడు పాకిస్తాన్‌ని ఎదుర్కోబోతున్నాడు. కచ్చితంగా రాణించాల్సిన ఈ మ్యాచ్‌లో మరి అయ్యర్ ఏం చేస్తాడో చూడాలి.
భారత్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు కూడా ఇది తొలి వన్డే వరల్డ్ కప్. ఆసియా కప్‌లో అదరగొట్టి సూపర్ ఫాంలో ఉన్నాడు సిరాజ్. దీంతో వన్డే వరల్డ్ కప్‌లో కూడా అదరగొడతాడని అంతా భావిస్తున్నారు. అయితే తొలి రెండు మ్యాచ్‌లలో అంతగా ప్రభావం చూపించని సిరాజ్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం ఓపెనర్ అబ్దుల్లా వికెట్ తీసి భారత్‌కు శుభారంభాన్నిచ్చాడు.
టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు కూడా ఇది తొలి వరల్డ్ కప్. కొద్ది రోజులుగా డెంగ్యూ సోకడంతో గిల్ తొలి రెండు వరల్డ్ కప్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే డెంగ్యూ నుంచి కోలుకున్న వెంటనే పాక్‌తో మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. ఈ మధ్య కాలంలో సెంచరీలతో విరుచుకుపడుతున్న గిల్.. ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి.
భారత ఆటగాళ్లే కాకుండా.. పాకిస్తాన్ ఆటగాళ్లు అబ్దుల్లా షఫీక్, సౌద్ షకీల్‌లకు కూడా ఇది తొలి వరల్డ్ కప్ మ్యాచ్. వరల్డ్ కప్‌లో భారత్‌ను ఎదుర్కోవడం వాళ్లకి కూడా చాలా స్పెషల్. గత మ్యాచ్‌లో శ్రీలంకపై సెంచరీతో మెరిసిన అబ్దుల్లా ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే అవుట్ కాగా.. మరి షకీల్ ఏం చేస్తాడో చూడాలి.