వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ రెండు టీమ్స్ తలపడాల్సి ఉంది. అయితే అదే సమయంలో నవరాత్రి ఉత్సవాలు కూడా ఉండటంతో మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని పోలీసులు స్పష్టం చేసినట్లు సమాచారం.
దీంతో ఈ మ్యాచ్ తేదీ మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై ఇటీవల మాట్లాడిన బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా అదే జరిగే అవకాశం ఉన్నట్లు హింట్ ఇచ్చాడు. మూడు సభ్య బోర్డులు తమ మ్యాచుల తేదీలు మార్చాలని కోరినట్లు తెలిపాడు. కాబట్టి వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు తప్పవని స్పష్టం చేశాడు.

ఈ క్రమంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ తేదీ కూడా మారుతుందని తెలుస్తోంది. ఇక ఈ మారిన షెడ్యూల్‌ను కూడా సోమవారం సాయంత్రంలోగా ప్రకటిస్తారని సమాచారం. దీనిపై పలు వార్తలు కూడా వస్తున్నాయి. గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచులు జరగలేదు.
ఆగస్టులో జరిగే ఆసియా కప్‌లో ఈ రెండు టీమ్స్ తలపడతాయి. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్‌లోనే దాయాదుల పోరు ఉంటుంది. ఇప్పటి వరకు వన్డే వరల్డ్ కప్‌లలో భారత్‌పై పాకిస్తాన్ ఒక్కసారి కూడా గెలవలేదు. అయితే ప్రస్తుతం టీమిండియా ఇంకా జట్టు కూర్పునే సరిగా అంచనా వేయలేకపోతోంది.
అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం మంచి జోరు మీద ఉంది. ఇటీవలి కాలంలో ఆ జట్టు ఆడిన దాదాపు అన్ని ఐసీసీ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శనే చేసింది. గతేడాది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఆడింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా భారత్‌ను వన్డే వరల్డ్ కప్‌లో ఓడించాలని పాక్ భావిస్తోంది. మరి కొత్త షెడ్యూల్‌లో ఈ రెండు టీమ్స్ ఎప్పుడు తలపడతాయో చూడాలి.