వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో కివీస్‌ను టీమిండియా ఢీకొంటోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్కోరు బోర్డుపై మంచి టార్గెట్ ఉంచితే, దాన్ని కాపాడుకోగలమనే ధీమా వ్యక్తం చేశాడు.
ఈ మెగాటోర్నీలో వాంఖడేలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ విజయాలు సాధించాయి. ఒక్క ఆఫ్ఘన్, ఆసీస్ మ్యాచులో మాత్రమే ఛేజింగ్ చేసిన కంగారూలు నెగ్గారు. దీంతో రోహిత్ తీసుకున్న నిర్ణయం సరైందేనని ఫ్యాన్స్ అంటున్నారు. అదే సమయంలో మరో విషయాన్ని కూడా కొందరు ఎత్తి చూపుతున్నారు.

భారత జట్టు వరల్డ్ కప్ నెగ్గిన 2011లో సెమీఫైనల్ మ్యాచులో టీమిండియానే ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆ మ్యాచ్ నెగ్గిన ధోనీ సేన.. ఫైనల్ కూడా నెగ్గి ట్రోఫీ ముద్దాడింది. ఆ తర్వాత జరిగిన రెండు వరల్డ్ కప్‌లు.. అంటే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2015 ప్రపంచ కప్. ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 ప్రపంచకప్ రెండింట్లో సెమీస్ చేరిన భారత్ ఛేజింగ్ చేసింది.
2015 సెమీస్‌లో ఆసీస్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టిన టీమిండియా.. 2019లో కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అంటే సెమీస్‌లో మనకు ముందుగా బ్యాటింగ్ చేయడమే కలిసొచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడు మళ్లీ టాస్ గెలిచిన రోహిత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఈ మ్యాచ్‌తోపాటు ఫైనల్‌లో ట్రోఫీ కూడా మనదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ అందరూ కూడా టీమిండియాకు ఈసారి మంచి అదృష్టం పట్టిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కప్పు టీమిండియాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా బౌలింగ్ కూడా ప్రస్తుతం బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ భారత జట్టే గెలుస్తుందని జోస్యం చెప్తున్నారు.