Virender Sehwag: కివీస్‌తో వరల్డ్ కప్ సెమీస్‌లో తలపడేందుకు టీమిండియా రెడీ అవుతోంది. వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గత వరల్డ్ కప్ అంటే 2019లో కూడా భారత జట్టు ఇప్పట్లాగే అద్భుత ఫామ్‌తో సెమీస్‌కు దూసుకొచ్చింది. కానీ సెమీఫైనల్‌లో కివీస్ చేతిలో షాకింగ్‌గా ఓడి ఇంటి దారి పట్టింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌పై ఫ్యాన్స్‌లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి 2019 హార్ట్ బ్రేక్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా టీమిండియా లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా టీమిండియాకు కీలక సలహా ఇచ్చాడు.

2011 వరల్డ్ కప్ విజయానికి ముందు అప్పటి టీమిండియా హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ చెప్పిన మాటలనే సెహ్వాగ్ గుర్తుచేశాడు. 'భయం లేకుండా ఆడండి. మీ బెస్ట్ చూపించండి' అని వీరూ చెప్పాడు. ఫలితం గురించి ఏమాత్రం ఆలోచించవద్దని, పదకొండు మంది ప్లేయర్లు రాణిస్తే కచ్చితంగా భారతే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
'మేం కీలక మ్యాచులకు ముందు మాట్లాడుకునే సమయంలో ఎవరూ కూడా మరొకరిని మెచ్చుకునే వాళ్లం కాదు. మన బెస్ట్ ఇవ్వాలని మాత్రమే చెప్పుకునే వాళ్లం. గ్యారీ కిర్‌స్టన్ కూడా డ్రెస్సింగ్ రూంలో ఎలాంటి నెగిటివిటీ లేకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. అది మాకు చాలా బాగా పనిచేసింది' అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
అలాగే టీమిండియా సారధి రోహిత్ శర్మ కెప్టెన్సీని కూడా సెహ్వాగ్ బాగా మెచ్చుకున్నాడు. 'రోహిత్ కొంత కాలంగా చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు అతను కెప్టెన్ కూడా. దాంతో మరింత బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. జట్టుకు శుభారంభాలు అందిస్తూనే ఎక్కువ పరుగులు చేస్తున్నాడు' అని కొనియాడాడు.
అదే సమయంలో కుర్ర ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడని, అది మెచ్చుకోదగిన విషయమని సెహ్వాగ్ అన్నాడు. అక్కడితో ఆగకుండా నాకౌట్ గేమ్స్‌లో గెలవాలంటే ఒక్కోసారి అదృష్టం కూడా కలిసి రావాలని చెప్పాడు. అయితే కేవలం లక్‌తో గెలవడం కుదరదని, ప్లేయర్లు కూడా రాణించాలని సూచించాడు.