World Cup 2023: వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన తొలి సెమీఫైనల్‌లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. ఇప్పటి వరకు నాకౌట్స్‌లో కివీస్‌పై గెలుపెరగని భారత్.. అద్భుతమైన ఆటతీరుతో 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా రాణించాడు.
మ్యాచ్ మధ్యలో తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన అతను.. చివర్లో మళ్లీ తిరిగొచ్చి 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న గిల్‌కు ఈ మ్యాచ్ పిచ్ గురించి జరుగుతున్న గొడవ గురించి ప్రశ్న ఎదురైంది. అది విన్న గిల్ ఆశ్చర్యపోయాడు.

'నాకు ఇప్పుడు మీ ప్రశ్న వింటేనే కాంట్రవర్సీ జరిగిందని తెలిసింది. ఇంతకీ ఆ కాంట్రవర్సీ ఏంటి?' అని గిల్ ప్రశ్నించాడు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 397/4 పరుగుల భారీ స్కోరు చేసింది. రెండో ఇన్నింగ్సులో బౌలింగ్ చేయడం కష్టమని తమకు తెలుసునని, కానీ రెండు - మూడు వికెట్లు తీసుకుంటే పరిస్థితి తమ అదుపులో ఉంటుదని నమ్మామని గిల్ చెప్పాడు.
ఛేజింగ్‌లో కేన్ విలియమ్సన్ (69), డారీల్ మిచెల్ (134) అద్భుతంగా ఆడారు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 181 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత విజయావకాశాలపై అనుమానాలు నెలకొన్నాయి. దీని గురించి మాట్లాడుతూ.. 'రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ సవాలేనని మాక్కూడా తెలుసు. బంతి పాతబడితే చాలా కష్టం' అని గిల్ చెప్పాడు.
'కనీసం పరుగులు ఆపడం కూడా ఇక్కడ కష్టమే. కానీ మేం అనుకున్న ప్రాంతాల్లో బౌలింగ్ చేస్తూ.. కివీస్ బ్యాటర్లు పొరపాటు చేసే వరకు వెయిట్ చేయడమే మా పని. అదే చేశాం. ఇక డారీల్, కేన్ భాగస్వామ్యం కొంత టెన్షన్ కలిగించిన మాట వాస్తవమే. కానీ ఆ టైంలో రెండు, మూడు వికెట్లు పడితే పరిస్థితి మారిపోతుందని నమ్మాం' అని చెప్పుకొచ్చాడు.