INDvsNZ: వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో టీమిండియాను ఎదుర్కోవడం తమకు చాలా స్పెషల్ అని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. మంచి జోరుమీదున్న భారత్‌ను ఎదుర్కోవడం తమకు చాలా మంచి ఛాలెంజ్ అని అభిప్రాయపడ్డాడు. వాంఖడే వేదికగా బుధవారం నాడు భారత్, కివీస్ జట్లు తొలి సెమీఫైనల్‌లో తలపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ మెగాటోర్నీని భారీ విజయంతో మొదలు పెట్టిన న్యూజిల్యాండ్ ఆ తర్వాత తడబడిన సంగతి తెలిసిందే. చివర్లో సెమీస్ బెర్తు కోసం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌తో కివీస్ పోటీ పడాల్సి వచ్చింది. అయితే తమ చివరి లీగ్ మ్యాచులో శ్రీలంకపై విజయంతో సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. ఇలా వరల్డ్ కప్ సెమీస్ చేరుకోవడం కివీస్‌కు ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.

ప్రస్తుతం టీంలో మంచి ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర.. సెమీస్ మ్యాచులో కూడా చెలరేగాలని కేన్ విలియమ్సన్ ఆశిస్తున్నాడు. 'రచిన్ అద్భుతంగా ఆడుతున్నాడు. తను పరుగులు చేస్తున్న విధానం సూపర్. సెమీస్ మ్యాచులో స్టేడియంలో నీలి సముద్రం ఉంటుందని మేం అనుకుంటున్నాం. వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌లో టీమిండియాను ఎదుర్కోవడం మాకు చాలా స్పెషల్' అని చెప్పాడు.
'ఇది మాకు చాలా మంచి ఛాలెంజ్. మా ఫోకస్ మొత్తం మా క్రికెట్ మీదనే ఉంది' అని స్పష్టం చేశాడు. ఈ టోర్నీలో రచిన్ రవీంద్ర అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పటికే మూడు శతకాలతో చెలరేగిన అతను ఓవరాల్‌గా 565 పరుగులతో వరల్డ్ కప్ టాప్ స్కోరర్లలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ధర్మశాల వేదికగా భారత్‌తో జరిగిన లీగ్ దశ మ్యాచ్ గురించి కూడా విలియమ్సన్ మాట్లాడాడు.
ఆ మ్యాచులో కివీస్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని చెప్పాడు. 'ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ చాలా గ్రేట్ గేమ్. కానీ ఇలా ఫైనల్స్‌కు చేరితే పరిస్థితులు చాలా మారిపోతాయి' అని చిన్న వార్నింగ్ ఇచ్చాడు. ధర్మశాలలో జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయానికి చేరువైంది. చివర్లో రవీంద్ర జడేజా లాంఛనం పూర్తి చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.