INDvsNZ: వాంఖడే వేదికగా జరిగిన ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్‌లో భారత్ జయభేరి మోగించింది. న్యూజిల్యాండ్‌పై 70 పరుగుల తేడాతో విజయం సాధించి, ప్రపంచ కప్ ఫైనల్‌లో అడుగు పెట్టింది. ఇది టీమిండియాకు నాలుగో వరల్డ్ కప్ ఫైనల్ కావడం గమనార్హం. ఈ మ్యాచులో భారత బ్యాటర్లు అందరూ ఆకట్టుకున్నారు.
రోహిత్ శర్మ (47), శుభ్‌మన్ గిల్ (80 నాటౌట్) జట్టుకు అదిరే ఆరంభం అందించారు. వారితోపాటు విరాట్ కోహ్లీ (117) మరో శతకంతో చెలరేగాడు. ఈ క్రమంలో సచిన్ పేరిట ఉన్న అత్యధిక వన్డే సెంచరీలు (49) రికార్డును బద్దలు కొట్టి తన కెరీర్‌లో 50వ వన్డే శతకం నమోదు చేశాడు. మధ్యలో గిల్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరడంతో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (105), చివర్లో కేఎల్ రాహుల్ (39 నాటౌట్) కూడా చెలరేగారు.

దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే (13), రచిన్ రవీంద్ర (13) ఇద్దరూ విఫలమయ్యారు. అయితే కేన్ విలియమ్సన్ (69), డారియల్ మిచెల్ (134) అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్లిద్దరూ క్రీజులో ఉన్నంతసేపూ భారత విజయం చాలా దూరంగా ఉన్నట్లే కనిపించింది.
ఆ తర్వాత విలియమ్సన్ అవుటైనా కూడా మిచెల్ మాత్రం స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీలుచిక్కిన ప్రతి బంతినీ బౌండరీకి తరలించాడు. ముఖ్యంగా సిరాజ్‌ను టార్గెట్ చేసిన అతను.. మియాన్ బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు పిండుకున్నాడు. చివరకు 46వ ఓవర్లో అతను అవుటయ్యే వరకూ.. టీమిండియా అభిమానులకు విజయంపై కాన్ఫిడెన్స్ లేదంటేనే మిచెల్ ఆట ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదు, ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా బౌలింగ్ ఎంత బలంగా కనిపిస్తుందో అందరికీ తెలిసిందే. అలాంటి బౌలింగ్ లైనప్‌పై ఈ టోర్నీలో రెండుసార్లు సెంచరీ చేశాడీ కివీస్ మిడిలార్డర్ బ్యాటర్. అంతకుముందు ధర్మశాల వేదికగా ఈ రెండు టీమ్స్ తలపడినప్పుడు కూడా మిచెల్ శతకంతో రాణించాడు. ఫ్యాన్స్ ఈ విషయాన్ని కూడా ఎత్తి చూపుతున్నారు. ఈ ఇండియన్ బౌలింగ్‌ను ఎదుర్కొని రెండుసార్లు సెంచరీలు చేయడం మాటలు కాదంటున్నారు.
ఇదే విషయాన్ని ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మిచెల్ ఇన్నింగ్స్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 'టీమిండియాను ఒంటి చేత్తో ఓడించినంత పని చేశావుగా' అని కొందరు మెచ్చుకుంటున్నారు. మరికొందరేమో ఈ సెమీస్ మ్యాచ్‌ను థ్రిల్లింగ్ మార్చింది అతని ఇన్నింగ్సే అంటున్నారు. ఏదేమైనా మిచెల్ ఇన్నింగ్స్ మాత్రం అందర్నీ అలరించిందనేది వాస్తవం.