ఈ వరల్డ్ కప్‌లో ఓటమే లేకుండా దూసుకుపోతున్నజట్టు టీమిండియా. ఆదివారం నాడు తమ చివరి లీగ్ మ్యాచులో నెదర్లాండ్స్‌ను భారత్ ఢీకొంటుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే టీం అంతా ఇక్కడకు చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టేసింది.
ఇలాంటి సమయంలో హోటల్‌లోనే తమ తమ కుటుంబాలను కలిసిన టీమిండియా స్టార్లు అందరూ సంప్రదాయ వస్త్రధారణలో అదిరిపోయారు. ఇలా అందరూ కలిసి ఉన్న ఫొటోలో.. దీన్ని నెట్టింట షేర్ చేసిన కేఎల్ రాహుల్.. అభిమానులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. 'మా నుంచి మీ అందరికీ.. దీపావళి శుభాాకంక్షలు' అని రాహుల్ ఈ పోస్టుకు క్యాప్షన్ తగిలించాడు.

ఈ ఫొటోలో టీమిండియా ప్లేయర్లతోపాటు సపోర్ట్ స్టాఫ్ సిబ్బంది కూడా సంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు. ఇక తమ చివరి లీగ్ మ్యాచులో నెదర్లాండ్స్‌ను కూడా ఓడించి, ఓటమే లేకుండా సెమీస్‌లో అడుగు పెట్టిన టీమిండియా.. ఇదే క్లాన్ స్లేట్‌లో ఫైనల్ చేరాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఇప్పుడు రాహుల్ షేర్ చేసిన ఫొటో చూసిన ఫ్యాన్స్ కూడా.. టీమిండియాకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. నెదర్లాండ్స్‌పై కూడా భారత్ చెలరేగాలని కోరుకున్నారు. మరి ఆదివారం నాడు మ్యాచ్‌లో టీమిండియా ఎలా ఆడుతుందో చూడాలి. ఇక ప్లేయర్ల కండీషన్ గురించి భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడాడు.
'సెమీస్ ముందు మేం ఆడే చివరి గేమ్ ఇది. మా ప్లేయర్లు మంచి షేప్‌లో ఉన్నారు. అన్ని విషయాలు చెప్పేయకుండా నేను మీకు ఇవ్వగలిగే మాట అదొక్కటే. ప్రస్తుతం ఫిజికల్‌గా, మెంటల్‌గా ఫిట్‌గా ఉండి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడేది ఎవరనే విషయంపైనే మా ఫోకస్ ఉంది. సెమీఫైనల్‌తోపాటు ఫైనల్‌కు వెళ్లే అర్హత సాధిస్తే.. అక్కడ కూడా చక్కగా రాణించడమే మా లక్ష్యం' అని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.