ప్రస్తుతం వరల్డ్ కప్‌లో టీమిండియా మంచి జోరు మీదుంది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. అదే సమయంలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగినా కూడా వరుస పరాజయాలతో ఇంగ్లండ్ చెత్త ప్రదర్శన చేస్తోంది. అసలు ఈ టీంను ఏం చేసి గాడిలో పెట్టాలో కూడా తనకు తెలియడం లేదని కెప్టెన్ జోస్ బట్లర్ అనేంతగా ఇంగ్లండ్ విఫలమవుతోంది.
ఇలాంటి సమయంలో లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా ఈ రెండు టీమ్స్ తలపడేందుకు రెడీ అయ్యాయి. ఈ క్రమంలో వరల్డ్ కప్‌లలో భారత్, ఇంగ్లండ్ మ్యాచుల చరిత్ర చూస్తే.. ఇది టీమిండియాకు చాలా టఫ్ మ్యాచ్ అని అర్థం అవుతుంది. ఎందుకంటే ఇంగ్లండ్‌ను వరల్డ్ కప్‌లో భారత్ ఓడించి 20 ఏళ్లు గడుస్తోంది. చివరగా 2003 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ను భారత్ ఓడించింది.

ఆ తర్వాత ఇంగ్లిష్ జట్టును టీమిండియా ఓడించలేదు. అంతకుముందు కూడా ఇంగ్లండ్‌పై భారత్ పైచేయి సాధించకపోవడం గమనార్హం. 1975 వరల్డ్ కప్‌లో భారత్‌పై ఇంగ్లండ్ ఏకంగా 202 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే 1983లో దీనికి పగ తీర్చుకున్న టీమిండియా.. 6 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ జట్టును ఓడించి సత్తాచాటింది. ఆ తర్వాత 1987లో 35 పరుగులతో ఇంగ్లండ్ విజయం సాధించింది.
అనంతరం 1992లో 9 పరుగుల తేడాతో మళ్లీ ఇంగ్లండే గెలిచింది. ఆ తర్వాత 1999లో 63 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్.. 2003లో మరోసారి ఆంగ్లేయులకు షాకిచ్చింది. 82 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఇక ఆ తర్వాత 2007లో ఈ రెండు జట్లు తలపడలేదు. భారత్ వరల్డ్ కప్ నెగ్గిన 2011లో కూడా టీమిండియా, ఇంగ్లండ్ మ్యాచ్ టైగా ముగియడం గమనార్హం.
ఇక 2019లో ఇంగ్లండ్ టీం చెలరేగింది. భారత్‌ను 31 పరుగుల తేడాతో ఓడించింది. అంటే వరల్డ్ కప్‌లలో చివరగా ఇంగ్లండ్‌ను టీమిండియా ఓడించి 20 ఏళ్లు దాటిందన్నమాట. దీంతో ఇంగ్లండ్‌పై ఈసారి భారత్ పైచేయి సాధిస్తుందా? లేక టేబుల్ టాపర్‌గా ఉన్న టీమిండియాను ఓడించి ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసం సాధిస్తుందా? అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.
ఈ రెండు టీమ్స్ తలపడినప్పుడు టీం ఫామ్ పెద్దగా పని చేయదని, ఆ రోజు ఎవరిదైతే వాళ్లే గెలుస్తారని అంటున్నారు. మరి భారత్ ఈ మ్యాచ్ కూడా గెలిచి సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలుస్తుందేమో చూడాలి.