Virat Kohli: న్యూజిల్యాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 95 రన్స్ చేసి జట్టుకు విజయాన్నందించాడు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ గెలవడమే కాకుండా.. పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా టాప్ ప్లేస్‌కు కూడా చేరుకుంది. ఇక ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది భారత్.
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన బ్యాటింగ్ గురించి మాట్లాడడమే కాకుండా.. బ్యాట్స్‌మన్‌గా ఎలైట్ మెంటాలిటీని ఎలా పెంపొందించుకోవాలో వివరించాడు. అలాగే పిచ్‌పై తాను కన్‌సిస్టెంట్‌గా రాణించడం వెనకున్న సీక్రెట్‌ని కూడా బయటపెట్టాడు.

'ప్రతి రోజూ, ప్రతి ప్రాక్టీస్ సెషన్, ప్రతి సీజన్, ప్రతి సంవత్సరం.. నన్ను నేను మెరుగ్గా తీర్చిదిద్దుకోవడంపైనే దృష్టి పెడతాను. అదే ఇన్నేళ్లపాటు కన్‌సిస్టెంట్‌గా నేను రాణించడానికి ఉపయోగపడింది. పడుతోంది కూడా. నేనే కాదు.. ఏ ఆటగాడైనా సరే.. తనను తాను మెరుగుపరుచుకునే మెంటాలిటీ ఉంటేనే గొప్పగా రాణించగలడు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
'నేను ఎప్పుడూ గొప్ప స్థాయికి చేరడంపై ఫోకస్ చేయలేదు. కేవలం నన్ను నేను బెటర్‌గా తీర్చిదిద్దుకోవడంపైనే అనుక్షణం ఫోకస్ చేస్తాను. ఎందుకంటే అసలు గొప్ప స్థాయికి చేరుకోవడం అంటే ఏంటో నాకు నిజంగా తెలియదు. దానికి ఓ ఎండ్ అంటూ లేదు. ఇది సాధిస్తే గొప్ప స్థాయికి చేరుకున్నట్లే అనే స్టాండర్డ్ సెటిల్‌మెంట్ ఏం లేదు. అందుకే నేను ప్రతి రోజూ రాణించడంపైనే ఫోకస్ చేస్తా. దానికి తగ్గట్లే నా మైండ్ సెట్‌ని కూడా ట్యూన్ చేస్తా. నేను ఎలా ఆడితే జట్టు గెలుస్తుందో దాని ప్రకారం ఆడతాను. దానివల్లే రాణిస్తున్నాను' అంటూ తాను ఇంతకాలం రాణించడం వెనకున్న సీక్రెట్‌ను బయటపెట్టాడు కోహ్లీ.
అలా కాకుండా ఏ ఆటగాడైనా గొప్ప స్థాయికి చేరుకోవాలి అనే ఆలోచనతో ముందుకెళితే కొంత కాలానికి లేదా ఓ స్థాయికి చేరుకున్న తర్వాత అతడి ఎదుగుదల మందగిస్తుందన్నాడు కోహ్లీ. ఎప్పుడైతే ఆటగాడు తన మెరుగవ్వడంపై దృష్టి పెట్టడం ఆపేస్తాడో అక్కడితో అతడి అభివృద్ధి నిలిచిపోతుందని, అందుకే ఆటగాళ్లు ప్రతి రోజూ ఎదడగడంపై దృష్టి సారించాలని సూచించాడు.