INDvsENG: ప్రపంచ క్రికెట్‌లో బెస్ట్ బ్యాటర్లలో ముగ్గురు. త్రిమూర్తుల వంటి ఆ ముగ్గురూ కూడా ఒకే మ్యాచులో డకౌట్ అవడం ఇప్పుడు వైరల్ అవుతోంది. అంత గొప్ప ఆటగాళ్లు కనీసం ఖాతా తెరవకపోవడం ఏంటని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. వాళ్లెవరో కాదు.. టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ స్టార్లు జో రూట్, బెన్ స్టోక్స్.
వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లండ్, భారత్ జట్లు లక్నోలోని భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ ఏకానా క్రికెట్ స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు అంత గొప్ప ఆరంభం దక్కలేదు. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై బ్యాటర్లు తడబడ్డారు. ఈ క్రమంలోనే 8 బంతులు ఎదుర్కొన్న తర్వాత కూడా కోహ్లీ ఖాతా తెరవలేకపోయాడు.

దీంతో ఇన్‌ఫీల్డ్ మీదుగా బంతిని బౌండరీ తరలించేందుకు భారీ షాట్ ఆడాడు. కానీ టైమింగ్ సరిగా కుదరకపోవడంతో బెన్ స్టోక్స్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వరల్డ్ కప్ మ్యాచులో ఇలా కోహ్లీ డకౌట్ అవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ రాణించారు.
ఈ ముగ్గురూ ఆకట్టుకోవడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులు చేసింది. ఛేజింగ్‌ను ఘనంగా ఆరంభించిన ఇంగ్లండ్‌కు జస్‌ప్రీత్ బుమ్రా పెద్ద షాకిచ్చాడు. డేవిడ్ మలాన్, జో రూట్ ఇద్దర్నీ వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. జో రూట్ అయితే తను ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు.

ఇంగ్లండ్ బ్యాటర్లలో కీలకమైన రూట్ ఇలా గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరడం చూసిన ఇంగ్లిష్ ఫ్యాన్స్ దిమ్మతిరిగిపోయింది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్ కూడా తేలిపోయాడు. అప్పటికి 9 బంతులు ఎదుర్కొని కూడా ఖాతా తెరవలేకపోయిన స్టోక్స్‌ను.. స్టార పేసర్ షమీ బుట్టలో వేసుకున్నాడు.

షమీ వేసిన డెలివరీని సరిగా అంచనా వేయలేకపోయిన స్టోక్స్.. లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ అతని బ్యాట్‌ను మిస్ అయిన బంతి వికెట్లను కూల్చింది. దీంతో స్టోక్స్ పది బంతులు ఎదుర్కొని కనీసం ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇలా ముగ్గురు స్టార్ ప్లేయర్లు కనీసం ఖాతా తెరవకుండా అవుటవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.