టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయమైంది. దీంతో అతను భారత్, న్యూజిల్యాండ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో మ్యాచులో కూడా అతను ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖలు చేశాడు.
హార్దిక్ లేకపోవడం జట్టుకు తీరని లోటని చెప్పాడు. 'జట్టులో అతను చాలా ముఖ్యమైన ఆటగాడు. అతను లేకపోవడం కచ్చితంగా జట్టుకు పెద్ద నష్టమే. ఈ స్థానంలో సూర్యకు అవకాశాలు లభిస్తాయని అనుకుంటున్నా. అతనేం చేయగలడో అందరికీ తెలిసిందే. కాబట్టి మేం అతనిపై నమ్మకం ఉంచుతున్నాం. హార్దిక్ వచ్చే వరకు సూర్యనే కొనసాగిస్తామని అనుకుంటున్నా' అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

వన్డే ఫార్మాట్లో సూర్య రికార్డు అంత గొప్పగా లేదు. అయితే సరిగ్గా వరల్డ్ కప్ ముందు జరిగిన ఆస్ట్రేలియా వన్డేల్లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. ఈ క్రమంలో వరల్డ్ కప్‌లో కూడా హార్దిక్ గైర్హాజరీలో కివీస్‌పై ఆడాడు. కానీ దురదృష్టవశాత్తూ రనౌట్ అయిన అతను పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో మళ్లీ సూర్యకు అవకాశం ఇస్తారా? అని అని ఫ్యాన్స్ కూడా ఆలోచిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇంగ్లండ్ మ్యాచును ఏమాత్రం తక్కువ అంచనా వేయడం లేదని కేఎల్ రాహుల్ అన్నాడు. అది చాలా ప్రమాదకరమైన టీం అని ఒప్పుకున్నాడు. 'అది చాలా డేంజరస్ టీం. ఇటీవలి కాలంలో వాళ్ల ప్రదర్శన ఎలా ఉన్నా మాకు అనవసరం. మా ఫోకస్ మొత్తం ఈ మ్యాచు మీదనే ఉంది' అని చెప్పుకొచ్చాడు.
ఇక లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తన ఐపీఎల్ హోం గ్రౌండ్లో ఆడేందుకు ఎగ్జయిట్ అవుతున్నట్లు తెలిపాడు. ఇక్కడి పిచ్ స్లోగా ఉంటుందని, బ్యాటర్లు కష్టపడకుంటే పరుగులు చేయలనేరని తెలుస్తోంది. మరి టీమిండియా ఈ మ్యాచులో ఎలా రాణిస్తుందో చూడాలి.