టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈసారి టీమిండియాకు అతను వరల్డ్ కప్ అందించి తీరతాడని చాలా మంది అంచనాలు వేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ లెజెండ్ మైఖేల్ వాన్ కూడా ఇదే తరహా కామెంట్స్ చేశాడు. అక్కడితో ఆగకుండా సచిన్ రికార్డు కూడా ఈ వరల్డ్ కప్‌లోనే కోహ్లీ బ్రేక్ చేస్తాడని జోస్యం చెప్పాడు.
ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీని మించిన చేజ్ మాస్టర్ లేడని మైకేల్ వాన్ కితాబిచ్చాడు. విరాట్‌ని చూస్తుంటే ఫుట్ బాల్ లెజెండ్ మెస్సీ గుర్తొస్తున్నాడని, మెస్సీ ఎలాగైతే అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించాడో విరాట్ కూడా అలాగే భారత్‌కు ఈ ప్రపంచ కప్ అంస్తాడని అభిప్రాయపడ్డాడు. టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఈ వరల్డ్ కప్ లో అద్భుతమైన ఫామ్ తో అదరగొడుతున్నాడు.

ఇప్పటికే ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో 354 పరుగులు చేసి టోర్నీలో రెండో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఈ క్రమంలోనే విరాట్ ని ఆకాశానికెత్తేశాడు మైఖేల్ వాన్. విరాట్ బ్యాటింగ్ చూస్తుంటే ఈ టోర్నీలోనే ఇంకా చాలా రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాడన్నాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీతో జట్టును గెలిపించిన తీరు, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో పోరులో కీలకమైన బ్యాటింగ్‌తో 95 పరుగులు చేసి జట్టును విజయం వరకు నడిపిన తీరు నిజంగా అద్భుతమన్నాడు.
అందుకే ఛేజింగ్‌లో విరాట్‌ను మించిన బ్యాటర్ ప్రపంచ క్రికెట్లో లేడని కితాబిచ్చాడు. "గొప్ప ఆటగాళ్ళు పెద్ద వేదికలపై అద్భుతంగా రాణించగలరు. కోహ్లీ అలాంటి ఆటగాడే. అతడి ఆటతీరు చూస్తుంటే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లోపే తన 49వ సెంచరీ, ఫైనల్‌లో 50వ సెంచరీ కచ్చితంగా బాదుతాడని అనిపిస్తోంది" అని వాన్ అన్నాడు.

కేవలం విరాట్ మాత్రమే కాదని, ఈ టోర్నీలో టీమిండియా ఓవరాల్‌గా అత్యంత బలంగా కనిపిస్తోందన్న వాన్.. ఆ జట్టును ఓడించాలంటే టాప్ ఆర్డర్‌ను సాధ్యమైనంత త్వరగా అవుట్ చేయాల్సి ఉంటుందన్నాడు. కానీ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆస్ట్రేలియా తప్ప మరే జట్టూ ఆ విషయంలో సక్సెస్ సాధించలేదని చెప్పుకొచ్చాడు.