వరల్డ్ కప్‌లో మరో కీలక పోరుకు భారత్ రెడీ అవుతోంది. బంగ్లాదేశ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఆసియా కప్‌లో కేవలం బంగ్లా చేతిలోనే భారత్ ఓడింది. అందుకే ఈసారి అలాంటి పొరపాటు రిపీట్ చేయకూడదని చూస్తోంది. మరి వరల్డ్ కప్‌లలో బంగ్లాపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు ఎవరో ఒకసారి చూస్తే..
సౌరవ్ గంగూలీ:2007 వరల్డ్ కప్‌లో భారత్‌ను బంగ్లాదేశ్ ఓడించింది. ఆ మ్యాచులో టాపార్డర్ కుప్పకూలినా కూడా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మొత్తం 129 బంతులు ఎదుర్కొని 66 పరుగులు చేశాడు. అప్పటికే 72/4తో జట్టు కష్టాల్లో ఉండగా వచ్చిన అతను.. ఒక ఎండ్‌లో గోడలా నిలబడ్డాడు.

ఆ తర్వాత అబ్దుల్లా రఫీక్ బౌలింగ్‌లో ముందుకు దూకి భారీ షాట్ ఆడబోయాడు. కానీ రఫీక్ తెలివిగా తన లెంగ్త్ తగ్గించడంతో మిడ్ వికెట్‌లో క్యాచ్ ఇచ్చిన గంగూలీ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మళ్లీ వరల్డ్ కప్‌లో బంగ్లాపై గంగూలీ ఆడలేదు.
కేఎల్ రాహుల్:టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఒక్క ఇన్నింగ్స్‌తోనే ఈ లిస్టులో చేరిపోయాడు. 2019 వలర్డ్ కప్‌లో శిఖర్ ధవన్ గాయపడటంతో రాహుల్ జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచులో రోహిత్ రాణించాడు. బంగ్లా టీంలో సైఫుద్దీన్, మష్రఫే మొర్తాజా, రూబెల్ హుస్సేన్.. ముగ్గురు బౌలర్లను సెలెక్ట్ చేసుకున్నాడు.
ఒక సమయంలో మరీ డిఫెన్స్ ఆడుతున్నట్లు కనిపించిన అతను.. ఈ ముగ్గురు బౌలర్లను తన స్టైల్‌లో ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రూబెల్ హుస్సేన్ వేసిన స్లో డెలివరీకి తడబడి వికెట్ పారేసుకున్నాడు.

విరాట్ కోహ్లీ:బంగ్లాపై అందరి కన్నా ఎక్కువ వరల్డ్ కప్ మ్యాచులు ఆడిన భారతీయ బ్యాటర్ విరాట్ కోహ్లీనే. 2011 నుంచి 2019 వరకు మూడుసార్లు బంగ్లా టైగర్స్‌ను కోహ్లీ ఎదుర్కొన్నాడు. వరల్డ్ కప్‌లో కోహ్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా బంగ్లాపైనే కావడం గమనార్హం. ఆ మ్యాచులో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు కూడా.
కానీ ఆ తర్వాత 2015, 2019 రెండు వరల్డ్ కప్‌లలో కూడా కోహ్లీ రాణించలేదు. 2015లో కేవలం 3 పరుగులే చేసి పెవిలియన్ చేరిన అతను.. 2019లో 26 పరుగులు చేసి అవుటయ్యాడు. ఓవరాల్‌గా బంగ్లాపై కోహ్లీ మూడు మ్యాచులు ఆడి 129 పరుగులు చేశాడు.
వీరేంద్ర సెహ్వాగ్:ఈ లిస్టులో రెండో ప్లేసులో ఉన్నది డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. కోహ్లీ సెంచరీ చేసిన మ్యాచులో సెహ్వాగ్ కూడా చెలరేగాడు. ఆ మ్యాచులో ఏకంగా 175 పరుగులతో మెరిశాడు. మ్యాచ్ మధ్యలో గాయం అవడంతో గంభీర్‌ను రన్నర్‌గా తెచ్చుకున్న సెహ్వాగ్.. అతనికి కూడా పెద్దగా పని చెప్పలేదు.
ధనాధన్ షాట్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొత్తం ఈ మ్యాచులో 14 ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడీ లెజెండ్. వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచుల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. అంతేకాదు, బంగ్లాపై ఇంత స్కోరు మరే బ్యాటర్ ఇప్పటి వరకు చేయలేదు కూడా. అంతకుముందు 2007లో జరిగిన మ్యాచులో సెహ్వాగ్ (2) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. ఓవరాల్‌గా బంగ్లాపై 177 పరుగులు చేశాడీ మాజీ లెజెండ్.

రోహిత్ శర్మ:ఇక బంగ్లా అంటే చాలు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పూనకం వచ్చేస్తుంది. వరల్డ్ కప్ అనగానే చెలరేగే రోహిత్.. బంగ్లాపై ఏకంగా రెండు సెంచరీలు చేయడం గమనార్హం. 2015, 2019 వరల్డ్ కప్‌లలో బంగ్లాపై చెలరేగాడీ స్టార్ బ్యాటర్. 2015లో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచులో బంగ్లాపై 137 పరుగులు చేశాడు రోహిత్.
ఆ టోర్నీలో రోహిత్ చేసిన ఏకైక సెంచరీ అదే. ఇక 2019లో కూడా బంగ్లాపై చెలరేగిన అతను 104 పరుగులతో మెరిశాడు. ఆ టోర్నీలో రోహిత్‌కు అది నాలుగో సెంచరీ. ఓవరాల్‌గా బంగ్లాపై 241 పరుగులతో.. ఈ టీంపై వరల్డ్ కప్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా ఉన్నాడు రోహిత్. మరి ఈ ఏడాది ఎలా రాణిస్తాడో చూడాలి.