INDvsAUS: వరల్డ్ కప్ ఫైనల్ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ప్రధాని మోదీ కూడా హాజరవుతారని తెలుస్తోంది. అలాగే ఆస్ట్రేలియా ప్రధానికి కూడా ఆహ్వానం పంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అమితాబ్ బచ్చన్ వంటి బడా సెలెబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు వస్తారు. ఈ క్రమంలోనే బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం నాడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గిన కెప్టెన్లు అందర్నీ ఈ మ్యాచ్ చూసేందుకు ఐసీసీ ఆహ్వానించింది. అలాగే అలా వచ్చే వారందరికీ ప్రత్యేకమైన బ్లేజర్ ఇవ్వాలని డిసైడ్ అయిందట.

ఈ గేమ్ చూసే సమయంలో ఈ లెజెండరీ కెప్టెన్లు అందరూ ఈ స్పెషల్ బ్లేజర్ వేసుకొంటారని తెలుస్తోంది. వీరిలో విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్, కపిల్ దేవ్, అలన్ బోర్డర్, అర్జున రణతుంగ, స్టీవ్ వా, రికీ పాంటింగ్, ఎంఎస్ ధోనీ, మైఖేల్ క్లార్క్, ఇయాన్ మోర్గాన్ తదితరులు ఈ మ్యాచ్ చూసేందుకు వస్తున్నట్లు సమాచారం.
పాక్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే ఈ మ్యాచ్ చూసేందుకు రావడం లేదు. ప్రస్తుతం అతను పాకిస్తాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కారణంగానే అతను ఈ వరల్డ్ కప్ ఫైనల్ చూసేందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇక అతను తప్ప ఇప్పటి వరకు వరల్డ్ కప్ నెగ్గిన కెప్టెన్లు అందరూ ఈ మ్యాచ్ వీక్షించేందుకు వస్తున్నారు.
ఇక ఈ వరల్డ్ కప్ మ్యాచ్ ముందు భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ టీం.. స్టేడియం గగనతలంలో వైమానిక విన్యాసాలు చేస్తుంది. దీనికి సంబంధించిన రిహార్సల్స్ కూడా మొదలైపోయాయి. అలాగే డ్యాన్సర్లు, తదితరులు కూడా తమ రిహార్సల్స్ మొదలు పెట్టారు. ముగింపు వేడుకల్లో ప్రముఖ ఇంగ్లిష్ సింగర్ దువా లిపా ప్రదర్శన ఉంటుందని సమాచారం.