భారత స్పిన్నర్లను ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా స్పెషల్ ప్లాన్ తో రెడీ అవుతోంది. ఈ విషయాన్ని ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మీడియాతో పంచుకున్నాడు.
2023 ప్రపంచకప్ లో భారత్ తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ ను 2-1 తో నెగ్గిన భారత్ ఈ మ్యాచ్ లో కూడా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని భావిస్తోంది. మరోవైపు వన్డే సిరీస్ లో ఆఖరి మ్యాచ్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్ లో కూడా ఎలాగైనా గెలవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.

అయితే వన్డే సిరీస్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్ళు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడ్డాడు. దీంతో వరల్డ్ కప్ లో కూడా స్పిన్ బౌలింగ్ పై దృష్టి సారిస్తోంది రోహిత్ సేన.
మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ తో జరిగిన వన్డే సిరీస్ ఈ వరల్డ్ కప్ లో తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నాడు. ముఖ్యంగా తొలి మ్యాచ్ లో భారత్ ను ఎదుర్కోవడం సులభం అవుతుందని చెప్పుకొచ్చాడు. తమ జట్టులో కీలక బ్యాటర్లంతా స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారని, దానికోసం నెట్స్ లో చేమటోడుస్తున్నారని అన్నాడు.
'మా బ్యాటర్లంతా భారత స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి స్పెషల్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. అందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంతేకాకుండా భారత పిచ్ లపై ఆస్ట్రేలియాకు మంచి రికార్డ్ కూడా ఉంది. కాబట్టి భారత్ తో జరిగే తొలి మ్యాచ్ లో తప్పకుండా గెలుస్తామనే విశ్వాసంతో ఉన్నాం' అని కమ్మిన్స్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత స్పిన్ దళం పటిష్ఠంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఒకవైపు అనుభవజ్ఞుడైన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మరోవైపు ఇన్ ఫామ్ స్పిన్నర్ కుల్దీప్ బాగా ఆడుతున్నారు. వీళ్ళకి తోడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఫామ్ లో ఉండడంతో టీమిండియా స్పిన్ దళం చాలా బలంగా కనిపిస్తుంది.