World Cup Final: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపై మాజీ క్రికెటర్ అతుల్ వసన్ ఆందోళన వ్యక్తం చేశాడు. రోహిత్ మరీ ఎక్కువ ఎగ్రెసివ్‌గా ఆడుతున్నాడని, కొంత బ్యాలెన్స్‌గా ఆడాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ముఖ్యంగా ఆసీస్‌తో జరిగే ఫైనల్ మ్యాచులో అతను జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందన్నాడు. లేదంటే మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ ఇద్దరూ రోహిత్‌ను ట్రాప్ చేస్తారని చెప్పాడు.
కాబట్టి రోహిత్ కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుందన్నాడు. ఈ వరల్డ్ కప్ ఆరంభం నుంచి రోహిత్ దూకుడుగా ఆడుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి పిచ్ అయినా సరే జట్టుకు విధ్వంసకర ఓపెనింగ్ అందించడంపైనే అతను ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత కోహ్లీ వచ్చి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు. వీళ్లిద్దరి పైనే భారత బ్యాటింగ్ లైనప్ అంతా ఆధారపడి ఆడుతోంది.

అయితే ఆసీస్ జట్టు ముందు ఇంత సింపుల్ వ్యూహాలు పనిచేయవని అతుల్ వసన్ అన్నాడు. 'రోహిత్ మరీ ఓవర్ ఎటాకింగ్ అప్రోచ్‌తో ఆడుతున్నాడు. అయితే మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ జోడీ ఈ వ్యూహాన్ని రోహిత్‌కు వ్యతిరేకంగా యూజ్ చేసుకుంటుందని నాకు భయంగా ఉంది. ఇప్పటి వరకు ప్రిపరేషన్స్ చక్కగా ఉన్నాయి. అన్నీ మ్యాచులు గెలుస్తూ కూడా వచ్చాం' అన్నాడు.
'దీంతో ఈ ఫైనల్ కూడా ఈజీగానే గెలిచేస్తాం అని అంతా అనుకుంటున్నారు. కానీ అది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే నేను ఆసీస్ టీంతో ఆడి ఉన్నా. వాళ్లు ఎలా ఆడతారో నాకు తెలుసు' అని వసన్ చెప్పుకొచ్చాడు. సెమీస్‌లో కివీస్‌ను ఓడించిన భారత్ ఫైనల్ చేరుకోగా.. రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాపై గెలిచిన ఆసీస్ ఫైనల్‌లో అడుగు పెట్టింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ రెండు జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకే ట్రోఫీ దక్కుతుంది.