భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ అనగానే కచ్చితంగా ఇండియానే గెలుస్తుందని మనందరం అనుకుంటాం. దాదాపు రిజల్ట్ కూడా అదే వస్తుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ చూస్తే కచ్చితంగా గెలుపు మనదేనని ధీమాగా ఉంటాం. కానీ ఆఫ్ఘనిస్తాన్‌ను అంత తేలికగా తీసుకోకూడదు. కారణం ఆ జట్టులోని కొంతమంది కీలక ప్లేయర్లే.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది. 14వ తేదీ పాకిస్తాన్‌తో మ్యాచ్ ముందు ఈ మ్యాచ్ టీమిండియాకు మంచి వార్మప్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ క్రికెట్ విశ్లేషకులు మాత్రం.. ఆఫ్ఘన్‌ను తేలికగా తీసుకోవద్దని టీమిండియాని హెచ్చరిస్తున్నారు.

వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయింది. అయినప్పటికీ ఆ జట్టును తేలికగా తీసుకోవద్దనేది విశ్లేషకుల మాట. ఆఫ్ఘాన్ తనదైన రోజున పెద్ద పెద్ద జట్లకు సైతం షాకివ్వగలదని హెచ్చరిస్తున్నారు. ఆ జట్టులో కూడా రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫజల్ హక్ ఫరూఖీ వంటి కీలక ప్లేయర్లున్నారని, వాళ్లు మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులని అంటున్నారు.
రషీద్ ఖాన్ :
రషీద్ ఖాన్ ఎంతటి డేంజరస్ బౌలర్ అనే విషయం అందరికీ తెలుసు. ఐపీఎల్‌లో పెద్ద పెద్ద బ్యాటర్లను సైతం రషీద్ తన స్పిన్ మాయాజాలంతో ముప్పు తిప్పలు పెట్టాడు. దానికి తోడు భారత్‌లో ఆడిన అనుభవం అతడికి పుష్కలంగా ఉంది. దానికి తోడు టీమిండియాలో ఎడం చేతి వాటం బ్యాటర్ల కొరత ఉండడం కూడా రషీద్‌కు కలిసొస్తుంది.
ఫజాల్‌హక్ :
ఆఫ్ఘన్ ఎడం చేతి వాటం పేసర్ ఫజాల్‌హక్ అద్భుతమైన స్పిన్ బౌలింగ్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. ముఖ్యంగా ఎడం చేతి వాటం పేసర్లను ఎదుర్కోవడంలో టీమిండియా టాప్ ఆర్డర్ అప్పుడప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫజల్ హక్ టీమిండియాను కలవరపెట్టే అవకాశం లేకపోలేదు.
రహ్మనుల్లా గుర్బాజ్ :
బౌలర్ల గురించి పక్కన పెడితే.. ఆఫ్ఘన్ జట్టులో డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ అద్భుత ఫాంలో ఉన్నాడు. ఒకవేళ గుర్బాజ్ కనుక రాణిస్తే ఆఫ్ఘన్ భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. మరి వీళ్లని టీమిండియా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.