న్యూఢిల్లీ: ప్రపంచ కప్ 2023లో టీమిండియా హవా కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో నెగ్గి కాకమీదుంది టీమ్. ఇదే ఊపుతో ఇక పాకిస్తాన్‌పై జెండా ఎగరేయడానికి రెడీ అవుతోంది. ఎల్లుండే ఈ హైఓల్టేజ్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. అటు పాకిస్తాన్ కూడా వరుస విజయాలతో దూకుడు కొనసాగిస్తోంది.
తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, మలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను మట్టికరిపించింది భారత్. బుధవారం రాత్రి ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 272 పరుగులు చేయగా.. 35 ఓవర్లల్లో కొట్టిపడేసింది టీమిండియా.

కేప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. 84 బంతుల్లోనే 131 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్‌లో 16 బౌండరీలు, అయిదు భారీ సిక్సర్లు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ- 55 (నాటౌట్), ఇషాన్ కిషన్- 47 పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్- 25 పరుగులతో చివరి వరకూ క్రీజ్‌లో నిలిచాడు.
ఈ సెంచరీతో ఎన్నో రికార్డులను తిరగరాశాడు రోహిత్ శర్మ. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా ఆవిర్భవించాడు. ఇప్పటివరకు 556 సిక్సర్లు కొట్టాడీ హిట్‌మ్యాన్. ఇదివరకు ఈ రికార్డు వెస్టిండీస్ బ్యాటింగ్ లెజెండ్ క్రిస్ గేల్ మీద ఉండేది. దాన్ని తుడిచి పెట్టాడు. రోహిత్ శర్మ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.
ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ తన నెక్స్ట్ టార్గెట్ ఏమిటో వెల్లడించాడు. దీనిపై తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశాడు. నెక్స్ట్ స్టాప్ అహ్మదాబాద్ అని పోస్ట్ పెట్టాడు. చెన్నై చెపాక స్టేడియంలో ఆస్ట్రేలియాను ఓడించడం, ఢిల్లీ అరుణ్ జైట్ల స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించిన అనంతరం ఇక అహ్మదాబాద్‌లో పాకిస్తాన్ పని పట్టబోతోన్నాం అనే అర్థం వచ్చేలా ఉందీ పోస్ట్.
దీనిపై ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. బాగా ఆడారు సర్.. అంటూ రిప్లై ఇచ్చాడు. రోహిత్ సేన చేతిలో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టులో వార్నర్ సభ్యుడు కూడా. అయినప్పటికీ- అలాంటి భేషజాలేవీ పెట్టుకోలేదీ లెఫ్ట్ హ్యాండర్. రోహిత్‌ను అభినందిస్తూ రిప్లై ఇచ్చాడు. తన స్పోర్టివ్‌నెస్ చాటుకున్నాడు.