ప్రపంచంలోని ప్రతి టీంలో విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఉంటారు. మన దాయాది దేశం పాకిస్తాన్ టీంలో కూడా అతనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారిలో యంగ్ పేసర్ హారిస్ రవూఫ్ కూడా ఒకడు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచులో రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లీ కొట్టిన రెండు సిక్సర్లు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలుసు.
తనకు ఎప్పుడు అవకాశం వచ్చినా ఆ ఓవర్లో కోహ్లీ కొట్టిన భారీ సిక్సర్‌ను రవూఫ్ మెచ్చుకుంటూనే ఉంటాడు. ప్రపంచంలో మరే క్రికెటర్ కూడా ఆ షాట్ ఆడలేడని, కోహ్లీ కాబట్టే ఆ షాట్ ఆడగలిగాడని మరోసారి చెప్పాడీ స్టార్ పేసర్. అయితే అంతకుముందు కూడా కోహ్లీ, రవూఫ్ కలిశారు. పాకిస్తాన్ టీంకు ఎంపికవడానికి ముందే ఈ ఘటన జరిగింది.

తాజాగా వరల్డ్ కప్ కోసం భారత్‌కు వచ్చిన రవూఫ్.. కోహ్లీని తను తొలిసారి కలిసినప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. 2018-19 సమయంలో ఆస్ట్రేలియాలో పర్యటన కోసం విరాట్ కోహ్లీ వెళ్లాడు. ఆ సమయంలో హారిస్ రవూఫ్.. టీమిండియా నెట్ బౌలర్‌గా సేవలందించాడు. ఆ సమయంలో కోహ్లీతో కూడా అతను ప్రాక్టీస్ చేశాడు. ఇదే విషయాన్ని తాజాగా రవూఫ్ గుర్తుచేసుకున్నాడు.
'నేను టీమిండియా నెట్ బౌలర్‌గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేశా. బంతి తన బ్యాటుకు ఎక్కడ తగులుతుందో కోహ్లీకి ముందే తెలిసినట్లు ఆడాడు. అంత కాన్సన్‌ట్రేషన్‌గా ఆడటం చూసి ఆశ్చర్యపోయా. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా నేను తనతో మ్యాచ్ ఆడుతున్న ఫీలింగ్ కలిగింది' అని రవూఫ్ అన్నాడు.
కోహ్లీకి ఆటపై ఉన్న కంట్రోల్, ఇంటెన్సిటీ చూస్తే తనకు క్రికెట్ ప్రపంచంలో అంత పేరు ఎందుకొచ్చిందో అర్థమైందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత 2020లో పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేసిన రవూఫ్.. ఇప్పుడు ఆ టీం ఫస్ట్ చాయిస్ బౌలర్లలో ఒకడిగా ఉన్న సంగతి తెలిసిందే.