వరల్డ్ కప్ లో గత కొన్నేళ్లుగా ఫేవరేట్లలో ఒకటిగా బరిలో దిగుతున్న టీమిండియా.. ట్రోఫీని మాత్రం ముద్దడలేకపోతోంది. ఇలాంటి నేపథ్యంలో ఈసారి స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ లో మరోసారి ఫేవరేట్లుగా టీమిండియా బరిలో నిలుస్తోంది. ఈ వరల్డ్ కప్ లో భారత్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. గత రెండు వరల్డ్ కప్ లను స్వదేశంలో ఆడిన జట్లే గెలిచాయి.
ఈ క్రమంలో భారత్‌లో జరుగుతున్న టోర్నీలో టీమిండియాపై భారీగా ఎక్స్‌పెక్టేషన్లు ఉన్నాయి. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచులో భారత జట్టు తమ వరల్డ్ కప్ ప్రయాణం మొదలు పెట్టనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తమ టీం ప్లాన్స్‌ను వివరించాడు. తమపై ఉండే ఒత్తిడి, అంచనాలను పాజిటివ్ ఎనర్జీగా మార్చుకుంటామని చెప్పుకొచ్చాడు.

'మా దగ్గర ప్రపంచ స్థాయి బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. మేమంతా సమిష్టిగా రాణించాలి. భయం లేకుండా ఆడాలి. మాపై ఉన్న ఒత్తిడి, అంచనాలను అడ్వాంటేజిగా వాడుకోవాలి. ఇప్పటి వరకు ఎలా ఆడుతూ వచ్చామో అలాగే రాణించాలి. మాపై ఇన్ని అంచనాలు ఉండటం ఎగ్జయిటింగ్‌గా ఉంది. అదే టైంలో ఫ్యాన్స్ నుంచి మాకు చాలా ప్రేమాభిమానాలు, చీర్స్ ూడా దక్కుతాయి. దీంతో మాలోని బెస్ట్ బయటకు వస్తుంది' అని పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు.
అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ టీంగా భారత జట్టు ఈ వరల్డ్ కప్‌లో అడుగు పెడుతోంది. దీనిపై మాట్లాడిన పాండ్యా.. తాము కొంత కాలంగా ఈ ర్యాంకును అంటిపెట్టుకొనే ఉన్నామన్నాడు. అంటే తాము చక్కగా రాణిస్తున్నామని, ఈ సక్సెస్‌ను వరల్డ్ కప్‌లో కూడా కొనసాగించడమే బాకీ ఉందని చెప్పాడు. ఈ ఏడాది ఇది సాధిస్తామనే నమ్మకం తమలో ఉందని ధీమా వ్యక్తం చేశాడు. అలాగే తన కెరీర్ పీక్స్‌లో ఇలా స్వదేశంలో వరల్డ్ కప్ ఆడే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశాడు.