బౌలింగ్ వేసే సమయంలో అప్పుడప్పుడూ వైడ్, నోబాల్స్ వేయడం తెలిసిందే. అయితే అవి చాలా మార్జిన్స్‌లో ఉంటాయి. అంటే వైడ్ క్రీజులో ఒకటి రెండు అంగుళాల దూరంలో ఉంటాయి. ఎప్పుడో ఒకసారి మరీ దూరంగా వెళ్తాయి. కానీ సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఒక భారీ వైడ్ చూసి షాకయ్యారు. నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఈ మ్యాచులో రీఎంట్రీ ఇచ్చిన సఫారీ పేసర్ గెరాల్డ్ కోట్జీ.. బంతి అందుకున్నాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేస్తున్న అతను వేగంగా వచ్చి విసిరిన బంతి వైడ్ వెళ్లింది. అది ఎంత వైడ్ వెళ్లిందంటే కీపర్ క్వింటన్ డీ కాక్ దరిదాపుల్లో అది లేదు. ఏకంగా ఫస్ట్ స్లిప్‌లో ఉన్న హెన్రిక్ క్లాసెన్ వద్దకు వెళ్లింది. దాన్ని అతను పట్టుకొని నవ్వేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఫ్యాన్స్ కూడా మరీ ఇంత వైడ్ ఎలా వేశావురా అయ్యా? అని కోట్జీపై కామెంట్స్ చేస్తున్నారు. దానికితోడు ఇది అతను వేసిన రెండో వైడ్ కూడా. అంతకుముందు లెగ్ సైడ్ వైడ్ వేసిన అతను.. ఈసారి ఆఫ్‌సైడ్ ఇంత భారీ వైడ్ వేయడం చూసిన ఫ్యాన్స్ నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదంటూ నెట్టింట మీమ్స్ పంచుకుంటున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బలమైన సౌతాఫ్రికా బౌలింగ్‌ను నెదర్లాండ్స్ సమర్ధవంతంగా ఎదుర్కొంది. మిగతా బ్యాటర్లు అందరూ తడబడిన చోట నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. అతనికి చివర్లో ఆర్యన్ దత్ (23 నాటౌట్), వాన్ డర్ మెర్వ్ (29 నాటౌట్) మంచి సహకారం అందించడంతో ఆ జట్టు 43 ఓవర్లలో 245 పరుగులు చేసింది.