Virat Kohli: రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడిని మించిన ఫినిషర్ క్రికెట్ హిస్టరీలో లేడంటూ ఆకాశానికెత్తేశాడు. గౌతమ్ గంభీర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
న్యూజిల్యాండ్ తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. 274 పరుగుల టార్గెట్‌ను ఛేదించి ఈ వరల్డ్ కప్‌లో వరుసగా 5వ విజయాన్ని నమోదు చేసుకుంది. ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ 95 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు. విరాట్ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ని గౌతమ్ గంభీర్ ఎంతగానో మెచ్చుకున్నాడు.

'ఎప్పుడూ 5 నుంచి 7 స్థానాల్లో బ్యాటింగ్ చేసే బ్యాటర్లనే ఫినిషర్ అని ఎందుకు పిలుస్తారో నాకర్థం కాదు. నాకు తెలిసినంతవరకు ఓపెనింగ్ చేసినా, మిడిలార్డర్‌లో వచ్చినా, ఆఖరికి 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా.. చివరి వరకు నిలబడ్డారా..? లేదా..? ఆఖరి పరుగు వరకు మ్యాచ్‌ను నిలబెట్టారా..? లేదా..? అనేదే ఏ బ్యాటర్‌ని అయినా ది బెస్ట్ ఫినిషర్‌ని చేస్తుంద'ని గంభీర్ చెప్పుకొచ్చాడు.
అలాగే గత 10 ఏళ్లలో టీమిండియాకు సరైన ఫినిషర్ లేడని, ఆ లోటును తీర్చింది కోహ్లీనేనన్న గంభీర్.. ఇప్పుడు అతడిని మించిన ఫినిషర్ మరొకరు లేడన్నాడు. దానికి అతడు గెలిపించిన మ్యాచ్‌లే నిదర్శనమని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇకపై 5, 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేసే వాళ్లనే ఫినిషర్లు అని పిలవద్దంటూ ఫ్యాన్స్‌కు సలహా ఇచ్చాడు.
అలాగే విరాట్ సెంచరీ గురించి మాట్లాడుతూ.. దాని గురించి మనం అంత ఎక్కవగా ఆలోచించాల్సిన పని లేదన్నాడు. 'మనం సెంచరీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నామంటే అతడి 95 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌ని గుర్తుంచుకోవడం మర్చిపోతున్నాం. మ్యాచ్‌లో జట్టును గెలిపించాడు కోహ్లీ. అది అతడి 49వ సెంచరీ కానీ, 100వ సెంచరీ కానీ.. ఆ విషయాన్ని పట్టించుకోకపోవడమే మంచిది' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.