తనను అందరూ ఛేజ్ మాస్టర్ అని ఎందుకు పిలుస్తారో కోహ్లీ మరోసారి నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా చేతిలో కచ్చితంగా ఓడిపోతుందనుకున్న మ్యాచులో టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మాజీ లెజెండ్ గౌతం గంభీర్ కూడా కోహ్లీ ఇన్నింగ్స్‌ను తెగ మెచ్చుకున్నాడు. వీళ్లిద్దరికీ అంతగా పడదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ సమయంలో కూడా కోహ్లీ, గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది.
అయితే ఈ మ్యాచులో కోహ్లీ ఆటతీరును ఆకాశానికి ఎత్తేసిన గంభీర్.. 'ఒక్కసారి ఆ పరిస్థితి ఊహించుకోండి. కేవలం రెండు పరుగులకే మూడు వికెట్లు పడ్డాయి. అలాంటి సమయంలో భారీ షాట్లు ఆడకూడదు. అయినా సరే ఒత్తిడిని మాత్రం మనపై తీసుకోవాలి. స్ట్రైక్ రొటేట్ చేయాలి. ఇప్పుడే వస్తున్న కుర్ర క్రికెటర్లు అందరూ కోహ్లీ నుంచి ఇదే నేర్చుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఇది చాలా ముఖ్యం. అందుకే కోహ్లీ ఇంత నిలకడగా రాణిస్తున్నాడు' అని గంభీర్ చెప్పాడు.

'డ్రెస్సింగ్ రూంలో ఉన్న చాలా మంది కుర్ర క్రికెటర్లకు ఫిట్‌నెస్, వికెట్ల మధ్య పరిగెత్తడంం, మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రొటేట్ చేయడం ఎంత ముఖ్యమో అర్థం అయ్యి ఉంటుంది. టీ20 ఫార్మాట్ వచ్చేయడంతో అందరూ భారీ సాట్లు ఆడటానికి ప్రయత్నిస్తున్నారు. అది కరెక్ట్ కాదు' అని వివరించాడీ మాజీ ఓపెనర్. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీకి 15 పరుగుల దూరంలో అవుటయ్యాడు. ఇది అతనికి వరల్డ్ కప్‌లలో 9వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.
'మ్యాచ్‌ను ఎలా అర్థం చేసుకుంటామనేది చాలా ముఖ్యం. భారీ స్కోర్లు ఛేజ్ చేయాలంటే ఆ ఒత్తిడిని తీసుకోవడం తెలిసుండాలి. ఎలాంటి పరిస్థితిలో అయినా నేను ఈ ఛేజ్ పూర్తి చేస్తాను అనే నమ్మకం మనకుండాలి. కోహ్లీ అది చేస్తున్నాడంటే.. ఏదో భారీ షాట్లు ఆడటం వల్ల కాదని అర్థం చేసుకోవాలి' అని గంభీర్ చెప్పుకొచ్చాడు. అలాగే స్ట్రైక్ రొటేట్ చేయడం ఎంత ముఖ్యమో వివరించాడు.
'వికెట్ల మధ్య పరిగెత్తడం, స్ట్రైక్ రొటేట్ చేయడం చాలా ముఖ్యం. మనపై ఏమాత్రం ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఎంత తక్కువ డాట్ ఆడితే అంత మంచి స్థానంలో మనం ఉంటాం. ఎందుకంటే ఈ కొత్త రూల్స్, ఐదుగురు ఫీల్డర్లు సర్కిల్ లోపలే ఉండటం, రెండు కొత్త బాల్స్ వల్ల మనం ఎప్పుడైనా ఇన్నింగ్స్ వేగం పెంచొచ్చు' అని వెల్లడించాడు.