టీమిండియా మాజీ ఓపెనర్, లెజెండరీ బ్యాటర్ గౌతం గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవలి కాలంలో ఐసీసీ టోర్నీలు గెలవడంతో భారత్ తడబడటానికి కారణం ఏంటో వెల్లడించాడు. ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా చెప్పేసే గంభీర్.. ఈసారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అదే సమయంలో ఆస్ట్రేలియాతో భారత్ ఆడిన మ్యాచ్‌లో కనిపించిన దృశ్యాలు కూడా గంభీర్ మాటలు నిజమేనని నిరూపిస్తున్నాయి.
ఆస్ట్రేలియాతో జరిగిన తమ తొలి వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ ఉత్కంఠ విజయాన్నందుకుంది. 2 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయినా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ క్రీజులో పాతుకుపోయి ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే 85 రన్స్ చేసి అవుటైన కోహ్లీ చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. డ్రెస్సింగ్ రూంలో కూర్చుని తల బాదుకుంటున్న వీడియోలు కూడా బయటకొచ్చాయి.

ఇక రాహుల్ కూడా 97 రన్స్ చేసి నాటౌట్‌గా నిలబడినా త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నందుకు కొద్దిగా బాధపడ్డాడు. రాహుల్ సెంచరీ మిస్ కావడానికి పాండ్యానే కారణమంటూ కూడా ట్రోల్ కూడా వచ్చాయి. అయితే ఇలా సెంచరీల కోసం పాకులాడడం, వ్యక్తిగత గణాంకాల కోసం ఆటగాళ్లు ఆడడం వల్లే భారత్ ఐసీసీ టోర్నీలు గెలవలేకపోతోందని టీమిండియా మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ అనడం ఇప్పుడు సంచలనంగా మారింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గంభీర్.. ఏ ఆటగాడైనా 40 రన్స్ చేసినా లేదా 140 రన్స్ చేసినా.. చివర్లో జట్టు గెలిచిందా? లేదా? అనేదే ముఖ్యమన్నాడు. ప్రస్తుతం టీమిండియాలోని ఆటగాళ్లు వ్యక్తిగత గణాంకాల కోసం ఆడుతున్నారని, దానివల్లే ఎన్నో ఏళ్లుగా భారత్ ఒక్క ఐసీసీ టోర్నీలో కూడా ఛాంపియన్ కాలేకపోయిందని చెప్పుకొచ్చాడు.
'నా అభిప్రాయం ప్రకారం ఏ ఆటగాడైనా సెంచరీ చేశాడా..? అర్థ సెంచరీ చేశాడా..? అనేది ముఖ్యం కాదు. మ్యాచ్‌లో చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును గెలిపించామా..? లేదా..? అనేదే ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తూ ప్రస్తుతం ఆటగాళ్లలో ఆ ఆలోచన కొద్దిగా తగ్గినట్లు నాకనిపిస్తోంది' అంటూ గంభీర్ సంచలన కామెంట్స్ చేశాడు.
ఇదిలా ఉంటే భారత్ ఏదైనా ఐసీసీ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచి దాదాపు 10 ఏళ్లు గడిచిపోయింది. ఎప్పుడో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ అందుకుంది. అదే భారత్ గెలుచుకున్న ఆఖరి ఐసీసీ ట్రోఫీ. ఆ తర్వాత సెమీఫైనల్, ఫైనల్స్‌కు వెళ్తున్నా కూడా ట్రోఫీ మాత్రం నెగ్గలేదు.
అప్పటి నుంచి 2 వరుస వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్స్, 2015, 2019 వన్డే వరల్డ్ కప్‌లు, 4 టీ20 వరల్డ్ కప్‌లు.. ఇలా ఇన్ని ఐసీసీ టోర్నీలు జరిగినా ఒక్కదానిలో కూడా భారత్ ఛాంపియన్ కాలేకపోయింది. మరి ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న 2023 ప్రపంచకప్‌లో అయినా భారత్ గెలుస్తుందేమో చూడాలి.