ఆసియా కప్‌లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. దీంతో టీమిండియా సారధి రోహిత్ శర్మ కెప్టెన్సీని అందరూ మెచ్చుకుంటున్నారు. టీమిండియా మాజీ దిగ్గజం గౌతం గంభీర్ కూడా రోహిత్ సారధ్య వ్యూహాలను మెచ్చుకున్నాడు. అదే సమయంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇండైరెక్టుగా చురకలేశాడు.
ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకు భారత జట్టు కేవలం 50 పరుగులకే ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లక్ష్యాన్ని టీమిండియా యువ ఓపెనర్లు గిల్, కిషన్ కలిసి 6.1 ఓవర్లలోనే ఛేదించారు. దీంతో భారత జట్టు 8వసారి ఆసియా కప్ టైటిల్ ముద్దాడింది. రోహిత్ సారధ్యంలో ఆసియా కప్ గెలవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఈ విజయం గురించి మాట్లాడిన గంభీర్.. రోహిత్ కెప్టెన్సీని తెగ మెచ్చుకున్నాడు. 'రోహిత్ కెప్టెన్సీ గురించి అసలు ప్రశ్నే అక్కర్లేదు. తను ఐదు వరల్డ్ కప్ ట్రోఫీలు గెలిచాడు. చాలా మంది కనీసం ఒక్కసారి కూడా ఐపీఎల్ గెలవలేదు' అని గంభీర్ అన్నాడు. ఈ మాటలు ఎవరినీ డైరెక్ట్ చేసి గంభీర్ అన్నట్లు పైకి కనిపించడం లేదు.
కానీ కోహ్లీని టార్గెట్ చేస్తూ గంభీర్ ఈ కామెంట్స్ చేశాడని నెటిజన్లు భావిస్తున్నారు. ఐపీఎల్ సమయంలో కోహ్లీ, గంభీర్ మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అలాగే రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. అదే సమయంలో విరాట్ కోహ్లీ మాత్రం ఇప్పటి వరకు ప్లేయర్‌గా, కెప్టెన్‌గా ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా నెగ్గలేదు.
రోహిత్ కెప్టెన్సీ బాగున్నా.. అతనికి అసలు సవాల్ వరల్డ్ కప్‌లోనే అని గంభీర్ అన్నాడు. '15 రోజుల్లో రోహిత్ కెప్టెన్సీకి అసలు పరీక్ష. ఇప్పుడు డ్రెస్సింగ్ రూంలో బెస్ట్ అనుకున్న 15-18 మంది ఆటగాళ్లు ఉన్నారు. వరల్డ్ కప్‌లలో జట్టు ఫెయిలైతే కెప్టెన్సీని ప్రశ్నిస్తారు. విరాట్ కోహ్లీ, ద్రావిడ్ వంటి వాళ్లంతా ఇవి ఎదుర్కొన్న వారే. ఈసారి ఫెయిలైతే రోహిత్‌కు కూడా ఈ ప్రశ్నలు తప్పవు' అని గంభీర్ పేర్కొన్నాడు.