వరల్డ్ కప్‌కు ముందు జరిగే మేజర్ టోర్నీ ఆసియా కప్. దీనిలో రాణించిన వారికే వరల్డ్ కప్ టీంలో చోటు దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకుండా.. ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్‌ను ఆసియా కప్ కోసం సెలెక్టర్లు ఎంపిక చేశారు. అతను గాయంతో ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడకముందే.. వన్డే వరల్డ్ కప్ టీంను ప్రకటించారు. దీనిలో కూడా రాహుల్ పేరు చేర్చారు.
ఇది చూసిన చాలా మందిఈ నిర్ణయంపై మండిపడ్డారు. కనీసం ఫామ్‌లో ఉన్నాడో లేదో కూడా చూడకుండా రాహుల్‌ను వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీకి ఎలా ఎంపిక చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని గురించి తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. అసలు సెలెక్టర్లు ఇలా రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేస్తున్నారో చోప్రా వివరించే ప్రయత్నం చేశాడు.

అన్ని ఫార్మాట్లలో రాహుల్ నిలకడగా రాణించాడని, అలాగే ఓపెనర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలిగే ఫ్లెక్సిబిలిటీ ఉన్న ప్లేయర్ అని చోప్రా అన్నాడు. టీంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల కన్నా రాహుల్ ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ తీసుకొస్తాడని చోప్రా అభిప్రాయపడ్డాడు. 'ఎప్పుడూ రాహులే ఎందుకు? అని చాలాకాలంగా చర్చ జరుగుతోంది' అని చోప్రా చెప్పాడు.
'రాహుల్‌పై టీమిండియా ఎందుకు అంత ఇంట్రస్ట్ చూపిస్తోంది? ఓపెనర్ అయినా కూడా.. ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల చాలా కొద్ది మంది ప్లేయర్లలో రాహుల్ ఒకడు. అదే సమయంలో ఆ స్థానాల్లో కూడా రాహుల్ రాణిస్తాడు. మరీ సీరియస్‌గా తీసుకోకపోతే.. మనం రోహిత్‌ను ఐదో నెంబర్‌లో బ్యాటింగ్ చేయాలని అడగలేం కదా. అలాగే ఈ స్థానంలో కోహ్లీ బాగా రాణిస్తాడని కూడా ఊహించలేం' అని చోప్రా తెలిపాడు.
'గతంలో రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఈ స్థానంలో ఆడారు. కానీ ఇప్పుడు వాళ్ల బెస్ట్ మాత్రం టాపార్డరే కదా. కానీ రాహుల్ అలా కాదు. ఓపెనింగ్‌లో అయినా ఐదో నెంబర్‌లో అయినా నిలకడగా రాణిస్తాడు' అని చోప్రా వివరించాడు. రాహుల్ ఇప్పటి వరకు 52 వన్డే మ్యాచుల్లో 45.13 సగటు, 86.57 స్ట్రైక్ రేటుతో 1986 పరుగులు చేశాడు ఐదో నెంబర్‌లో అతని రికార్డు ఇంకా బాగుంది. ఈ స్థానంలో 18 సార్లు బ్యాటింగ్ చేసిన అతను 53 సగటు, 99.33 స్ట్రైక్ రేటుతో 742 పరుగులు చేశాడు.