పాకిస్తాన్, భారత్ మధ్య మ్యాచ్ అంటే ఆ హైప్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. క్రికెట్ ప్రపంచం కనీసం కన్నార్పకుండా ఈ మ్యాచ్ చూస్తుంది. అలాంటి మ్యాచ్ ముందు రెండు దేశాల మాజీ దిగ్గజాలు చేసే కామెంట్స్ కూడా మ్యాచ్‌పై ఊపు పెంచడం సహజమే. ఈ క్రమంలోనే తాజాగా పాక్ లెజెండ్ షోయబ్ అక్తర్ చేసిన ఒక ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
దాన్ని అతను వెంటనే డిలీట్ చేసినా.. నెటిజన్లు మాత్రం అక్తర్‌ను టార్గెట్ చేస్తూ తెగ ట్రోలింగ్ చేసేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. భారత్, పాక్ మ్యాచ్ ముందు తన పాత ఫొటోను అక్తర్ ట్వీట్ చేశాడు. సచిన్ వికెట్ తీసి తను సెలబ్రేట్ చేసుకుంటున్న ఆ ఫొటోను షేర్ చేస్తూ.. 'హిస్టరీ రిపీట్ అవుతుంది' అని పోస్టు పెట్టాడు. ఇదే అతన్ని చిక్కుల్లో పడేసింది.

వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్ ఒక్కసారి కూడా భారత్‌పై నెగ్గలేదు. యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో మాత్రమే నెగ్గింది. కానీ వన్డే వరల్డ్ కప్‌లలో అది జరగలేదు. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు వన్డే వరల్డ్ కప్‌లలో తలపడిన ప్రతిసారీ విజయం భారత్‌కే దక్కింది. ఇది గుర్తులేని అక్తర్.. చరిత్ర రిపీట్ అవుతుందని ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ జోకులు పేలుస్తున్నారు.
అక్తర్ కూడా టీమిండియాకు సపోర్ట్ ఇస్తున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో మ్యాచ్ స్క్రిప్ట్ అప్పుడే లీక్ అయిపోయిందంటూ జోకులు పేలుస్తున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి భారత్‌కు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్యూ అక్తర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌పై అంచనాలు మాత్రం తారస్థాయికి చేరిన మాట మాత్రం వాస్తవం. మరి ఈ దాయాదుల పోరు ఎంత ఉత్కంఠగా సాగుతుందో చూడాలి.