వన్డే వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ దారుణమైన ఓటమి చవిచూసింది. పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడింది. ఏకంగా 69 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ అద్భుతంగా ఆడింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న రహ్మనుల్లా గుర్బాజ్ (80) టీ20 తరహా బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
అతనితోపాటు ఇబ్రహీం జద్రాన్ (28) కూడా ఫర్వాలేదనిపించాడు. అయితే వన్ డౌన్‌లో వచ్చిన రహ్మత్ షా (3), కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (14), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (19) రాణించలేదు. అయితే తన తొలి మ్యాచ్ ఆడుతున్న ఇక్రమ్ అలిఖిల్ (58) చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రషీద్ ఖాన్ (23), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (28) కూడా ఫర్వాలేదనిపించారు.

దీంతో ఆ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తేలిపోయింది. ఒక్క హ్యారీ బ్రూక్ (66) మినహా అందరూ విఫలమయ్యారు. దీంతో ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేజ్ చేయలేకపోయింది. చివర్లు 40.3 ఓవర్లలో 215 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ వరుసగా మూడు వికెట్లు కూడా తీసుకున్నాడు.
ఇలా ఇంగ్లండ్ ఓడిపోవడంపై అటు ఫ్యాన్స్, ఇటు నిపుణులు మండి పడుతున్నారు. అయితే ఇంగ్లండ్ మాజీ లెజెండ్ మైకేల్ వాన్ మాత్రం షాకింగ్ అభిప్రాయపం చెప్పాడు. ఇలా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడినా కూడా ఇంగ్లండ్ కచ్చితంగా వరల్డ్ కప్ సెమీస్ చేరుతుందని జోస్యం చెప్పాడు. ప్రస్తుత పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశాడు.
'వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్' అంటూ ట్వీట్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఎవరు ఏమనుకున్నా సరే తను అనుకున్నది చెప్పేస్తున్నాడంటూ వాన్ ట్వీట్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన ఇంగ్లండ్ ఆడిన మూడు మ్యాచుల్లో రెండు ఓడిపోవడంతో ఆ టీంలో జోరు తగ్గిందనే చెప్పాలి.