అహ్మదాబాద్: ఇంకొక్కరోజు మత్రమే మిగిలివుంది. ఐసీసీ ప్రపంచ కప్ 2023లో తుది పోరుకు సర్వం సిద్ధమైంది. గుజరాత్‌లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్‌ను ఢీకొట్టబోతోంది ఆస్ట్రేలియా. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కానుంది.
కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. అమీతుమీ తేల్చుకోవడానికి రెండు జట్లు సన్నద్ధమౌతున్నాయి. నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తోన్నాయి. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తోన్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ సారథ్యంలో ప్రాక్టీస్ సెషన్ కంటిన్యూ అవుతోంది.

ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా సమరోత్సాహంతో సన్నద్ధమౌతోంది. ఉంది. బలమైన దక్షిణాఫ్రికాను సెమీ ఫైనల్స్‌లో మట్టికరిపించిన దూకుడు మీద కనిపిస్తోందా జట్టు. సొంత గడ్డపై చెలరేగుతున్న భారత్‌ను కట్టడి చేయడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగా నెట్స్‌లో చెమటోడ్చుతుంది.
ఈ మ్యాచ్‌ను తిలకించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. విజేతకు ఆయనే స్వయానా ట్రోఫీని బహూకరించే అవకాశాలు లేకపోలేదు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్, అస్సాం ముఖ్యమంత్రులు భూపేంద్ర పటేల్, హిమంత బిశ్వ శర్మ, బీసీసీఐ ఛైర్మన్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరు కానున్నారు.
ఆస్ట్రేలియా నుంచి ఆ దేశ ఉప ప్రధానమంత్రి రిచర్డ్ మార్లెస్ మ్యాచ్ చూడటానికి రానున్నారు. రక్షణ మంత్రిత్ శాఖను కూడా ఆయనే పర్యవేక్షిస్తోన్నారు. తొలుత ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బెనీస్ వస్తారని భావించారు గానీ ఆయన షెడ్యూల్ ఖరారు కాలేదు. దీనితో ఉప ప్రధాని అహ్మదాబాద్‌కు రానున్నారు. మోదీతో కలిసి ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.

దీన్ని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అహ్మదాబాద్ పోలీసులు. దీనికి సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ జ్ఞానేంద్ర సింగ్ మలిక్ వెల్లడించారు. కొద్ది సేపటి కిందటే ఆయన అహ్మదాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
స్టేడియం లోపల 3,000 మంది పోలీసు సిబ్బందిని మోహరింపజేస్తామని పోలీస్ కమిషనర్ వివరించారు. ఒక కంపెనీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఉంటుందని వివరించారు. నగరం మొత్తం మీద ట్రాఫిక్ పర్యవేక్షణతోపాటు విమానాశ్రయం వద్ద వీఐపీల రాకపోకలకు ఆటంకం కలగకుండా, హోటళ్లల్లో తనిఖీలను నిర్వహించడానికి సుమారు 6,000 మంది సిబ్బందిని మోహరించనున్నామని చెప్పారు.
రెండు చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, చేతక్ కమాండోలు, 10 బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను భద్రత కోసం వినియోగిస్తామని చెప్పారు. రేడియోలాజికల్, బయోలాజికల్, కెమికల్, న్యూక్లియర్ వెపన్స్‌ను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.