ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్స్‌లో భారత్‌ను ఢీ కొట్టే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. రెండో సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్స్‌లో భారత్‌తో తలపడుతుంది.
ఫైనల్స్‌లో తలపడబోయే భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. లీగ్స్ దశ నుంచి సెమీ ఫైనల్స్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు టీమిండియా. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ దూకుడు మీద ఉన్నారు.

బౌలింగ్ డిపార్ట్‌మెంట్ సత్తా చాటుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించింది. బ్యాటర్లు భారీగా పరుగులు చేస్తోండగా.. బౌలర్లు ప్రత్యర్థులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తోన్నారు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.. బ్యాటర్లను భయపెడుతున్నారు. లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులను సంధిస్తూ నిప్పులు చెరుగుతున్నారు.
ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోవడానికి జట్టు సన్నద్ధమౌతోంది. నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తోంది. కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తోన్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ సారథ్యంలో ప్రాక్టీస్ సెషన్ కంటిన్యూ అవుతోంది.
ఈ సందర్భంగా రోహిత్ శర్మ.. స్లిప్ క్యాచ్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కనిపించింది. స్లిప్స్‌లో ఫీల్డింగ్ మోహరించడం, తక్కువ ఎత్తులో వచ్చే క్యాచ్‌లను అందుకోవడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం ఆకర్షించింది. లో- క్యాచ్‌లను అందుకోవడంపై హెడ్ కోచ్ నుంచి సలహాలు తీసుకున్నాడు.

దీనికి కారణాలు లేకపోలేదు. అహ్మదాబాద్ పిచ్.. మందకొడిగా ఉంటుందని, బంతులు తక్కువ ఎత్తులో దూసుకొస్తాయంటూ క్యురేటర్ రిపోర్ట్ ఇవ్వడమే. తక్కువ ఎత్తులో దూసుకొచ్చే బంతులు.. బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడానికి అధిక అవకాశాలు ఉన్నాయి. ఎడ్జ్ తీసుకున్న తరువాత అవి స్లిప్స్ వైపే పరుగులు తీస్తుంటాయి. వాటిని క్యాచ్‌లుగా మలచుకోవడంపై రోహిత్ శర్మ దృష్టి పెట్టాడు.