ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్స్‌లో భారత్‌ను ఢీ కొట్టే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. రెండో సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్స్‌లో భారత్‌తో తలపడుతుంది.
ఫైనల్స్‌లో తలపడబోయే భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. లీగ్స్ దశ నుంచి సెమీ ఫైనల్స్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు టీమిండియా. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ దూకుడు మీద ఉన్నారు.

బౌలింగ్ డిపార్ట్‌మెంట్ సత్తా చాటుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించింది. బ్యాటర్లు భారీగా పరుగులు చేస్తోండగా.. బౌలర్లు ప్రత్యర్థులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తోన్నారు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.. బ్యాటర్లను భయపెడుతున్నారు. లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులను సంధిస్తూ నిప్పులు చెరుగుతున్నారు.
ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోవడానికి జట్టు సన్నద్ధమౌతోంది. నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తోంది. కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తోన్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ సారథ్యంలో ప్రాక్టీస్ సెషన్ కంటిన్యూ అవుతోంది.
ఈ మ్యాచ్‌ను చూడటానికి పలు ప్రధాన నగరాల నుంచి అహ్మదాబాద్‌కు చేరుకుంటోన్నారు క్రికెట్ ప్రేమికులు. వ్యక్తిగత వాహనాలు, విమానాలు, రైళ్ల ద్వారా అహ్మదాబాద్‌కు వస్తోన్నారు. ఇప్పటికే అహ్మదాబాద్‌లో హోటళ్లు బుక్ అయ్యాయి. రోడ్లపై వాహనాల రద్దీ రోజువారీ కంటే భారీగా పెరిగింది.

ఢిల్లీ, ముంబై, చెన్నై నుంచి క్రికెట్ ప్రేమికులు పెద్ద సంఖ్యలో అహ్మదాబాద్‌కు చేరుకునే అవకాశం ఉన్నందున రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా నగరాల నుంచి ప్రత్యేక రైళ్లను అహ్మదాబాద్‌కు నడిపిస్తోన్నారు. ఢిల్లీ నుంచి ఒకటి, ముంబై నుంచి మూడు స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
చెన్నై, బెంగళూరు వంటి దక్షిణాది నగరాల నుంచి అహ్మదాబాద్‌కు వచ్చే వారి కోసం ముంబై నుంచి రైలు సౌకర్యాన్ని కల్పించినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. మ్యాచ్ ముగిసిన తరువాత ఆయా రైళ్లన్నీ కూడా మళ్లీ తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. సోమవారం తెల్లవారు జామున 2:30 గంటలకు ఢిల్లీ, ముంబైలకు తిరుగు ప్రయాణమౌతాయి.