ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్స్‌లో భారత్‌ను ఢీ కొట్టే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. రెండో సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్స్‌లో భారత్‌తో తలపడుతుంది.
ఫైనల్స్‌లో తలపడబోయే భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. లీగ్స్ దశ నుంచి సెమీ ఫైనల్స్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు టీమిండియా. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ దూకుడు మీద ఉన్నారు.

బౌలింగ్ డిపార్ట్‌మెంట్ సత్తా చాటుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించింది. బ్యాటర్లు భారీగా పరుగులు చేస్తోండగా.. బౌలర్లు ప్రత్యర్థులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తోన్నారు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.. బ్యాటర్లను భయపెడుతున్నారు. లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులను సంధిస్తూ నిప్పులు చెరుగుతున్నారు.
ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోవడానికి జట్టు సన్నద్ధమౌతోంది. నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తోంది. కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తోన్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ సారథ్యంలో ప్రాక్టీస్ సెషన్ కంటిన్యూ అవుతోంది.
ఈ వరల్డ్ కప్ ఫైనల్స్ సందర్భంగా బీసీసీఐ గ్రాండ్ సెలబ్రేషన్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుందనేది వివరించింది. ఫైనల్స్ ముగింపు కార్యక్రమంలో ఎవరు పెర్ఫార్మ్ చేయబోతోన్నారనేది తెలియజేసింది.
దీని ప్రకారం.. మధ్యాహ్నం 1:35 నిమిషాల నుంచే సెలబ్రేషన్స్ ఆరంభమౌతాయి. టాస్ పడిన వెంటనే వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ టీమ్ ఎయిర్ షోను నిర్వహిస్తుంది. తొలి ఇన్నింగ్ బ్రేక్‌లో టాప్ ప్లే బ్యాక్ సింగర్ ఆదిత్య ఘడ్వీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ప్రీతమ్ చక్రవర్తి, జొనితా గాంధీ, నకష్ అజీజ్, అమిత్ మిశ్రా, ఆకాశా సింగ్, తుషార్ జోషి పెర్‌ఫార్మ్ చేస్తారు.
రెండో ఇన్నింగ్ బ్రేక్ సమయంలో లేజర్ అండ్ లైట్ షోలను ఏర్పాటు చేసింది బీసీసీఐ. దీనికి సంబంధించిన తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మ్యాచ్‌ను తిలకించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరు కానున్నారు.