cwc23:ఎప్పుడు ఏం జరిగినా సరే.. భారతీయులతో గొడవ పెట్టుకోకూడదు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో భారతీయ నెటిజన్లతో పెట్టుకుంటే నిప్పుతో తలగోక్కున్నట్లే. ఈ విషయం తెలిసే చాలా మంది భారతీయులపై విమర్శలు చేయకుండా ఆగుతుంటారు. కానీ కొందరు విమర్శలు చేసేసి ఆ తర్వాత నెటిజన్ల వెటకారాలు చూసి బాధపడుతూ ఉండిపోతుంటారు.
ఇప్పుడు పాకిస్తాన్ టీం పరిస్థితి అలాగే మారింది. భారత్‌తో జరిగిన మ్యాచులో పాకిస్తాన్ అత్యంత పేలవంగా ఆడింది. జట్టు మొత్తమ్మీద కేవలం ముగ్గురు బ్యాటర్లే ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత బౌలర్లు కూడా తేలిపోయారు. దీంతో భారత్ చేతిలో ఘోరంగా ఓడింది. ఛాంపియన్ టీమ్స్‌కు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవడం సహజమే. కానీ ఆ టైంలో ఆ జట్లు సాకులు వెతకవు.

'మేం సరిగా ఆడలేదు. అందుకే ఓడిపోయాం' అని ధైర్యంగా చెప్తాయి. కానీ పాకిస్తాన్ అలా చేయలేదు. ఆ టీం కోచ్ మిక్కీ ఆర్థర్.. మీడియా ముందుకొచ్చి టీమిండియా ఫ్యాన్స్ మీద అసహనం వ్యక్తం చేశాడు. స్టేడియంలో 'దిల్ దిల్ పాకిస్తాన్' పాట వినిపించలేదని, ఇది వరల్డ్ కప్‌లా లేదని నానా మాటలు అన్నాడు. ఫ్యాన్స్ ఇలా ప్రవర్తించడం వల్లనే పాక్ ఓడిపోయిందని ఆరోపించాడు.
దీన్ని అక్కడితో వదిలేయాల్సిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. బీసీసీఐపై ఐసీసీకి కంప్లయింట్ కూడా చేసింది. అందుకే ఆ తర్వాత వరల్డ్ కప్‌లో ఏ మ్యాచ్ జరిగినా సరే.. భారతీయ నెటిజన్లు మాత్రం పాకిస్తాన్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓడినా కూడా.. పాకిస్తాన్‌పై మీమ్స్ పేలుస్తున్నారు. పాకిస్తాన్ ఎలాగైతే 'దిల్ దిల్ పాకిస్తాన్' పాట అడిగిందో.. దాన్ని ఎత్తి చూపుతున్నారు.
ఈసారి స్టేడియంలో బంగ్లా ఫేవరెట్ 'నాగిన్ డ్యాన్స్' పాట పెట్టలేదు అందుకే బంగ్లాదేశ్ ఓడిపోయింది అంటూ జోకులు పేలుస్తున్నారు. ఇది చూసిన చాలా మంది పాకిస్తానీ ఫ్యాన్స్.. 'అరే నాయనా ఇక ఆపండిరా. ఇలా చంపకండి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే పాకిస్తాన్ టీం పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్లుంది.
ఇక చెన్నై వేదికగా జరిగే ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో కూడా ఓడితే పాక్ ఎలాంటి సాకులు వెతుక్కుంటుందో చూడాలి. కానీ అప్పుడు కూడా నెటిజన్లు పాక్‌ను టార్గెట్ చేసి చీల్చిచెండాటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా చూస్తే మిక్కీ ఆర్థర్ కూడా ఎందుకు అలా అన్నానా? అని ఏడవడం ఖాయం అని ఫ్యాన్స్ జోక్ చేస్తున్నారు.