సౌతాఫ్రికాతో జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచులో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది. లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో కంగారూలు ఏకంగా 134 పరుగుల తేడాతో చిత్తయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు ఓపెనర్ క్వింటన్ డీకాక్ (109), ఎయిడెన్ మార్క్రమ్ (56) బ్యాటుతో రాణించారు.
మిగతా బ్యాటర్లు కూడా ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 311 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. దీంతో ఒకానొక సమయంలో ఈ జట్టు 70 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

ఇలాంటి సమయంలో మార్నస్ లబుషేన్ (46) టెస్టు తరహా ఆటతో ఇన్నింగ్సును కొంత దూరం లాక్కొచ్చాడు. అతనికి మిచెల్ స్టార్క్ (27) నుంచి చక్కని సహకారం అందింది. అయితే ఆ తర్వాత వీళ్లు కూడా అవుటైపోయారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (22) కొంత పోటీ ఇచ్చారు. కానీ అది కూడా ఎక్కువ సేపు కొనసాగలేదు.
దీంతో ఆస్ట్రేలియా జట్టు 40.5 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీ బౌలర్లలో రబాడ మూడు వికెట్లతో చెలరేగాడు. యాన్సెన్, కేశవ్ మహరాజ్, షంసీ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఇలా ఆసీస్ చిత్తుగా ఓడిపోవడం చూసిన ఫ్యాన్స్ నోరెళ్లబెట్టారు. వరల్డ్ కప్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన ఈ టీం ఇంత చెత్తగా ఓడిపోవడం వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆస్ట్రేలియాకు కూడా పాకిస్తాన్ రోగం పట్టిందా? అని అడుగుతున్నారు. పాక్ కూడా తాము ఆడిన రెండు మ్యాచుల్లో పసికూనలపై చచ్చీచెడీ గెలిచిన సంగతి తెలిసిందే. నెదర్లాండ్స్‌పై పాకిస్తాన్ దాదాపు ఓడినంత పని చేసింది. ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచులోనూ అలాంటి పరిస్థితే కనిపించింది. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. ఆసీస్ కూడా పాక్ లాగే ఒత్తిడికి తలొగ్గుతున్నారని అంటున్నారు. మరి ఇక ముందైనా ఆసీస్ కోలుకుంటుందేమో చూడాలి.