ఒక టీంలో ప్లేయర్ల మధ్య గొడవలు ఉండొచ్చు. కానీ వాటిని మీడియా ముందు పెట్టుకొని ఇష్యూ పెద్దది చేయడం కరెక్ట్ కాదు. కానీ బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఇదే జరుగుతోంది. ఆ టీం వెటరన్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్, కెప్టెన్ షకీబల్ హసన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆసియా కప్‌కు కొన్ని రోజుల ముందే జట్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన తమీమ్.. క్రికెట్ నుంచి కూడా రిటైర్‌మెంట్ తీసుకున్నాడు.
ఈ షాకింగ్ వార్త నుంచి ఫ్యాన్స్ తేరుకునేలోపే తమీమ్ మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు. ఆసియా కప్ ఆడకపోయినా వరల్డ్ కప్‌లో అతను ఆడతాడని అంతా అనుకున్నారు. అయితే టోర్నీలో కేవలం నాలుగైదు మ్యాచులే ఆడతానని తమీమ్ ఆఫర్ ఇచ్చాడట. దీంతో చిర్రెత్తిన షకీబల్.. అసలు టీంలో తమీమ్ అక్కర్లేదని తేల్చిచెప్పేశాడట. ఇటీవల ఇంటర్వ్యూలో తమీమ్‌పై అతను షాకింగ్ కామెంట్స్ చేశాడు.
తాజాగా సోషల్ మీడియాలో తను ఎందుకు ఆడటం లేదో వెల్లడించిన తమీమ్ ఇక్బాల్.. బోర్డు అధికారులు తనను మిడిలార్డర్‌లో ఆడమన్నారని, కానీ తనకు అది ఇష్టం లేదని స్పష్టం చేశాడు. దీనిపై మాట్లాడిన షకీబల్ హసన్.. 'ఇది చిన్న పిల్లల గొడవలా ఉంది. బ్యాటు నాది కాబట్టి నేనే ఆడతా అంటున్నాడు. రోహిత్ శర్మ వంటి బ్యాటర్లు కూడా ఏడో స్థానంలో మొదలెట్టి ఓపెనర్‌కు వచ్చాడు కదా' అని చెప్పాడు.
జట్టు కోసం ఆలోచించకుండా కేవలం వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆలోచిస్తేనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని షకీబల్ హసన్ మండిపడ్డాడు. టీంకు ఏం కావాలో అది చేయాలి కానీ, తనకు ఇష్టం వచ్చినట్లే అంతా జరగాలని అనడం కరెక్ట్ కాదన్నాడు. అలాగే తమీమ్ కొంత కాలం క్రితం వరకు వెన్నునొప్పితో బాధ పడ్డాడు. ఇప్పుడు కూడా దాని నుంచి అతను పూర్తిగా కోలుకోలేదు.
ఈ క్రమంలో ఇలాంటి అన్‌ఫిట్ ప్లేయర్‌ను తాను మోసుకెళ్లలేనని షకీబల్ హసన్ తేల్చిచెప్పాడు. ఈ సందర్భంగా ఎంఎస్ ధోనీ అన్నమాటలు గుర్తుచేశాడు. 'అన్‌ఫిట్‌గా ప్లేయర్‌ను ఆడించడం అంటే దేశాన్ని, జట్టును మోసం చేయడమే' అని ధోనీ చెప్పాడు. ఇవే మాటలు చెప్పిన షకీబల్ హసన్.. తను కూడా అలాంటి పని చేయబోనని స్పష్టం చేశాడు. ఇలా బంగ్లా క్రికెట్‌లో గొడవలు చూసిన ఫ్యాన్స్ షాకవుతున్నారు.

ఇది క్రికెట్‌లో రెజిల్‌మేనియాలా ఉందని కొందరు అంటుంటే.. తమీమ్, షకీబ్ ఇద్దరూ కొట్టుకుంటారేమో? అని మరికొందరు జోకులు వేస్తున్నారు. ఇదంతా పెద్ద డ్రామాలా ఉందని, వరల్డ్ కప్ వంటి టోర్నీ ముందు ఇలాంటి గొడవలు ఆ టీంకు ఏమాత్రం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.