వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఓటమే లేకుండా టీమిండియా దూసుకెళ్తోంది. ఇది చూసిన ఫ్యాన్స్ మాత్రం సంతోషించాల్సిందిపోయి టెన్షన్ పడిపోతున్నారు. ఇలా టీమిండియా అజేయంగా సెమీస్‌లో అడుగు పెట్టడం మంచిదేనా? అని తెగ చర్చించుకుంటున్నారు. దీనికి కారనం లేకపోలేదు.
2011లో వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత భారత జట్టు రెండు వన్డే వరల్డ్ కప్‌లు ఆడిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2015 వరల్డ్ కప్, అలాగే ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వన్డే వరల్డ్ కప్.. రెండింట్లో టీమిండియా ఇలాగే చెలరేగింది. బలమైన జట్టుతో బరిలో దిగిన భారత జట్టు.. అద్భుతంగా ఆడింది.

2015లో గ్రూప్-బీలో ఉన్న భారత జట్టు ఆడిన ఆరు మ్యాచుల్లో.. ఆరింటీ విజయ కేతనం ఎగరేసింది. మొత్తం 12 పాయింట్లు, పాజిటివ్ నెట్ రన్ రేట్‌తో సెమీస్‌లో అడుగు పెట్టింది. గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన ఆసీస్‌తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో భారత్ ఓటమి పాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 328/7 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్‌లో భారత్‌కు అనుకున్న ఆరంభం దక్కలేదు. ముఖ్యంగా ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (1) విఫలం అవడంతో ఆ మ్యాచులో టీం కోలుకోలేకపోయింది. రహానే (44), ధోనీ (65) కొంత పోరాడినా ఫలితం లేకపోయింది.
ఇక ఇప్పుడు జరుగుతున్న ఫార్మాట్లోనే 2019లో కూడా వరల్డ్ కప్ లీగ్ జరిగింది. మొత్తం పది జట్లు తలపడిన ఈ టోర్నీలో ఒక్కో టీం 9 మ్యాచులు ఆడింది. తను ఆడిన 9 మ్యాచుల్లో ఏడింట జయభేరి మోగించిన భారత జట్టు 15 పాయింట్లతో టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఆడిన 9లో కేవలం 6 మ్యాచులో గెలిచిన న్యూజిల్యాండ్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
సెమీస్‌లో భారత్, కివీస్ తలపడ్డాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 239/8 పరుగులు చేసింది. ఈ మ్యాచులో కూడా ఛేజింగ్ చేసిన భారత్.. 221 పరుగులకు ఆలౌట్ అయింది. ధోనీ రనౌట్ అయిన తర్వాత భారత్ విజయావకాశాలు పూర్తిగా ఆవిరైపోయాయి. దీంతో 18 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.
ఇక ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటికే 8 మ్యాచులు గెలిచిన భారత్.. చివరి మ్యాచులో నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచులో కూడా భారత్ గెలుపు దాదాపు ఖాయమనే చెప్పాలి. అంటే మొత్తం 9 మ్యాచులూ గెలిచి, సెమీస్‌లో అడుగు పెడుతుంది భారత్. అదే సమయంలో ప్రస్తుతం సమీకరణాలు బట్టి చూస్తే న్యూజిల్యాండ్ మళ్లీ నాలుగో స్థానంలో లీగ్ ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదే జరిగితే మళ్లీ సెమీస్‌లో భారత్, న్యూజిల్యాండ్ తలపడతాయి. ఇదంతా ఆలోచించుకుంటున్న అభిమానులు.. మళ్లీ టెన్షన్‌లో పడిపోతున్నారు. మళ్లీ 2015, 2019 వంటి హార్ట్ బ్రేక్ వస్తే తట్టుకోలేం అంటూ వాపోతున్నారు. అయితే కివీస్‌ను పక్కకు నెట్టి పాకిస్తాన్ కనుక సెమీస్ చేరితే కథ మారుతుందని భావిస్తున్నారు.
పాక్‌తో మ్యాచ్ అనగానే టీమిండియా రెచ్చిపోతుందని, కాబట్టి పాక్ కనుక సెమీస్ చేరితే.. వాళ్లను ఓడించి, టీమిండియా ఫైనల్‌కు వెళ్లడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజుల వెయిటింగ్ తప్పదు.