World Cup 2023: ఈ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జట్టుకు రెండో విజయం దక్కింది. పసికూన నెదర్లాండ్స్‌పై ప్రతాపం చూపించిన ఇంగ్లండ్ జయభేరి మోగించింది. ఏకంగా 160 పరుగుల తేడాతో ఈ మ్యాచులో విజయం సాధించింది. పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఎదుర్కొన్న ఇంగ్లండ్ చెలరేగింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
అయితే ఆ జట్టుకు అనుకున్న ఆరంభం లభించలేదు. జానీ బెయిర్‌స్టో (15) మరోసారి విఫలమయ్యాడు. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన జో రూట్ (28) కూడా పెద్దగా రాణించలేదు. హ్యారీ బ్రూక్ (11), జోస్ బట్లర్ (5), మొయీన్ అలీ (4), డేవిడ్ విల్లే (6) ఎవరూ రాణించలేదు. అయితే డేవిడ్ మలాన్ (87) అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత అతనికి జతకలిసిన బెన్ స్టోక్స్ (108) చెలరేగాడు.

వీరితోపాటు ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ (51) కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ దారుణంగా తడబడింది. ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయారు.
తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు (41 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ.. మిగతా బ్యాటర్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. వెస్లీ బారెసీ (37), సైబ్రాండ్ ఎండెల్‌బ్రెట్ (33), స్కాట్ ఎడ్వర్డ్స్ (38) తమకు దక్కిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. దీంతో నెదర్లాండ్స్ జట్టు 37.2 ఓవర్లలో కేవలం 179 పరుగులకే కుప్పకూలింది.

ఇంగ్లండ్ బౌలర్లలో మెయీన్ అలీ, అదిల్ రషీద్ ఇద్దరూ కూడా చెరో మూడేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన డేవిడ్ విల్లే రెండు వికెట్లతో రాణించాడు. సెంచరీతో ఇంగ్లండ్‌కు భారీ స్కోరు అందించిన బెన్ స్టోక్స్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
కాగా, ఈ టోర్నీలో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్‌లో వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచి, ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యేలా కనిపించిన ఇంగ్లండ్.. నెదర్లాండ్స్‌పై విజయంతో ఏడో స్థానానికి చేరుకొని ఊపిరి పీల్చుకుంది.